డల్లాస్: ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎల్‌లో ఇంగ్లాండ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టెక్సాస్‌లోని డల్లాస్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ జట్టు 4-2 గోల్స్ తేడాతో క్రోయేషియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ తమ వరల్డ్ కప్ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించింది. కొత్త హెడ్ కోచ్ థామస్ తుచెల్ నేతృత్వంలో ఇంగ్లాండ్‌కు ఇది తొలి మేజర్ టోర్నమెంట్ విజయం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ రెండు గోల్స్‌తో చెలరేగాడు. మ్యాచ్ 12వ నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచి ఇంగ్లాండ్‌కు తొలి ఆధిక్యాన్ని అందించిన కేన్.. ఆ తర్వాత 42వ నిమిషంలో అద్భుత హెడర్ ద్వారా మరో గోల్ కొట్టాడు. ఈ గోల్‌తో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వరల్డ్ కప్ గోల్స్ (10 గోల్స్) చేసిన గ్యారీ లినెకర్ రికార్డును కేన్ సమం చేశాడు. మరోవైపు ఇంగ్లాండ్ డిఫెన్స్ లోపాలను వాడుకుంటూ క్రోయేషియా తొలి అర్ధభాగంలో గట్టి పోటీనిచ్చింది. 36వ నిమిషంలో మార్టిన్ బాతురినా, అర్ధభాగం ముగిసే సమయానికి పెటార్ ముసా గోల్స్ చేయడంతో తొలి సగం ముగిసేసరికి స్కోరు 2-2 తో సమమైంది. రెండో అర్ధభాగంలో ఇంగ్లాండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. కోచ్ తుచెల్ ఇచ్చిన స్ఫూర్తి జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో రెండో అర్ధబాగం ప్రారంభమైన కేవలం రెండు నిమిషాలకే (47వ నిమిషంలో) యువ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఇంగ్లాండ్‌ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత మ్యాచ్ ముగియడానికి మరో ఐదు నిమిషాలు ఉందనగా (85వ నిమిషంలో), సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్కస్ రాష్‌ఫోర్డ్, బుకాయో సాకా అందించిన పాస్‌ను గోల్‌గా మలిచి ఇంగ్లాండ్ విజయాన్ని 4-2 తో ఖాయం చేశాడు. దీంతో దాదాపు 15ఏళ్ల తర్వాత ఒక స్టార్ జట్టును ఇంగ్లాండు జట్టు మట్టికరిపించింది.
పనామాపై ఒక గోల్‌తో ఘనా కూడా..
గ్రూప్-ఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఘనా జట్టు ఒకే ఒక గోల్‌తో పనామాపై విజయం సాధించింది. ఘనా జట్టులో స్టార్ ఆటగాడు థామస్ పార్టీ పనామాతో మ్యాచ్‌కు అతడు దూరంగా ఉండాల్సివచ్చింది. కెనడాలోకి అతడికి ఎంట్రీ ఇవ్వకపోవడమే అందుకు కారణం. ఇంగ్లాండ్‌లో అతడిపై అత్యాచార కేసు విచారణ సాగుతోంది. దీంతో కెనడాలోకి అడుగుపెట్టలేకపోయాడు. అయితే పనామాతో చివరివరకూ పోరాడి మరీ ఘనా విజయం సాధించింది. ఆట అదనపు సమయంలో ఘనా ప్లేయర్ కలేబ్ (90+5వ నిమిషం) గోల్ కొట్టాడు. దీంతో డ్రా చేద్దామనుకున్న పనామా ఆశలకు తెర పడింది. చివరికి ఘనా 1-0 తేడాతో పనామాను ఓడించింది. తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తో ఘనా.., క్రోయేషియా జట్టు పనామాతో తలపడనున్నాయి.








కామెంట్‌లు (0)