సినిమాలకు సరికొత్త సంగీత బాణీలు సమకూర్చి, ప్రేక్షకులను ఓలలాడించేందుకు తెలుగు సినీ పరిశ్రమలో మరో యువ సంగీత దర్శకుడు కెరటంలాగా సరిగమలకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు. మనసుకు వీనుల విందైన సంగీతాన్ని అందిస్తూ ఆ సంగీతంతో సినిమాహాళ్లు దద్దరిల్లేలా నూతన ఆవిష్కరణలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. అతడే శాండీ అద్దంకి. కళల కాణాచిగా పేరొందిన తెనాలికి ఈ యువ సంగీత దర్శకుడు.. తెలుగు, కన్నడ సినిమాలకు మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ‘కళ’ ఒక కుటుంబంలో శ్వాసగా మారితే.. ఆ ఇంటి గోడల మధ్య పెరిగే చిన్నారి మనసులకు ప్రతి అనుభవం జీవితాల్లో గొప్ప అనుభూతులుగా మిగిలిపోతాయి. కళలతో అనుబంధం ఉన్న కుటుంబంలో పెరిగిన వియాన్ ఎస్‌ఎ అలియాస్ శాండీ అద్దంకి కూడా అలాంటి అరుదైన వాతావరణంలోనే సంగీత ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నారు.
పేరు : శాండీ అద్దంకి (వియాన్.ఎస్‌ఎ)
తల్లిదండ్రులు : అద్దంకి కళా ప్రభాకర్,
పాల్ ప్రభాకర్
సొంతూరు : తెనాలి, గుంటూరుజిల్లా
సినీ సంగీత దర్శకుడు : తెలుగు, కన్నడ సినీ రంగంలో 20కిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం
గుంటూరు జిల్లా తెనాలి నేల నుంచి వచ్చిన ఈ యువ సంగీత దర్శకుడు శాండీ అద్దంకి నేడు వెండితెరపై తనదైన బాణీలను వినిపిస్తున్నారు. వియాన్.ఎస్‌ఎ స్క్రీన్ నేమ్ గా మార్చుకొని, కొత్త తరానికి చెందిన ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడిగా తన స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. శాండీ అద్దంకి కుటుంబ నేపథ్యమే కళలతో ముడిపడి ఉంది. ఆయన తల్లి అద్దంకి కళా ప్రభాకర్ ఆలిండియా రేడియో ‘ఎ’ గ్రేడ్ కళాకారిణిగా గొప్ప గుర్తింపు పొందారు. తండ్రి అద్దంకి పాల్ ప్రభాకర్ గొప్ప చిత్రకారులు. 1970-80 సంవత్సరాల్లో తన సన్నిహితులైన దర్శకులు బి. నర్సింగరావు, టి. వైకుంఠం, సుభాష్ బాబు, ఇంకా తదితర గొప్ప కళాకారులతో కలిసి ‘పల్లె పిలిచింది’, ‘దాసి’, ‘రంగుల కల’, ‘మోహనరాగం’ మొదలైన సినిమాలకు ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో కలిసి పనిచేసారు. తాతయ్య నుండి సంగీత వారసత్వం ఉండటం వల్ల అయన తండ్రి కూడా హైదరాబాద్ కేంద్రంగా సుప్రసిద్ధ కళాకారుల సంగీత కచేరీలలో ఎకార్డియన్ ప్లేయర్ గా పనిచేయటంతో సంగీతపరమైన మక్కువను ఏర్పర్చుకున్నారు. ఇలా తల్లితండ్రుల కళా నైపుణ్యం వల్ల చిన్ననాటి నుంచే ముగ్గురు అన్నయ్యలతో సహా అయనకు కూడా కళల పట్ల, కళాకారుల పట్ల సహజమైన అనుబంధం ఏర్పడింది.
అయితే కళారంగానికి అనుబంధం ఉన్న కుటుంబంలో పుట్టడం ఒక్కటే ఒకరిని సంగీత దర్శకుడిని చేయదు. ఆ అవకాశాన్ని ప్రతిభగా మలచుకోవాలంటే నిరంతర సాధన, కొత్తదనం పట్ల ఆసక్తి, సంగీతంపై లోతైన అవగాహన అవసరం. శాండీ సంగీత ప్రయాణంలో ఆ లక్షణాలు కనిపిస్తాయి. సంగీత దర్శకుడిగానే కాకుండా, గాయకుడిగానూ ఆయన తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే రామ్ గోపాల్ వర్మ సినిమాతో నేపథ్య సంగీత దర్శకుడిగా ఆయన తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలోని నేపథ్య సంగీతానికి సినిమా రంగంలో మంచి గుర్తింపు లభించింది. గాడ్సే, పోస్టర్, దేశంలో దొంగలు పడ్డారు, రాణి వంటి సినిమాలకు సంగీతాన్ని అందించి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రయోగాత్మక దృష్టి
తెలుగు, కన్నడ సినిమా రంగాల్లో కలిపి ఇప్పటివరకు 20 కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. సంగీత ప్రయాణంలో మరో ముఖ్యమైన అంశం ఆయన ప్రయోగాత్మక దృష్టి. సినిమా పాట మాత్రమే కాకుండా నేపథ్య సంగీతం, స్వతంత్ర గీతాలు, విభిన్న సంగీత ప్రక్రియల్లోనూ ఆయన ప్రయోగాలు చేస్తున్నారు. కన్నడ సినిమాలకు సంగీతం అందించడంతో పాటు పలు స్వతంత్ర సింగిల్స్ కూడా ఆయన పేరుతో విడుదలయ్యాయి. ఇటీవల విడుదలైన శిశిరం, ఆలోచన చిత్రాల ఆడియోలు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. శిశిరం చిత్రానికి సంబంధించిన ‘ఊపిరే వెలుతురవ్వాలి’ వంటి పాటలు విడుదలై, బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. సురేందర్ చాచా దర్శకత్వంలో వస్తున్న ‘ఆలోచన’ సినిమాకు సాహిత్యాన్ని అందరికీ అర్ధమయ్యేలాగా ప్రతాప్ రాజులపల్లి రచనలో తెలుగులోనికి అనువదించి తనదైన శైలిలో కొత్త బాణీలు స్వరపర్చారు. వియాన్ ఎస్‌ఎ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం. వారసత్వంగా కళారంగంలో రాణిస్తూనే తన స్వీయ ప్రతిభతో టాలీవుడ్‌లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లిదండ్రుల నుంచి కళా ప్రపంచాన్ని అర్థం చేసుకునే దృష్టిని పొంది.. తన సృజనకు మరింత పదును పెడుతున్నారు. సంగీత ప్రపంచంలో ప్రతి తరం తనదైన శబ్దాన్ని సృష్టిస్తుంది. సాంప్రదాయ స్వరాల అందాన్ని కాపాడుతూనే వాటికి నూతన సొబగులు అద్దుతోంది. కొత్త ఆలోచనలను కలిపే యువ సంగీత కళాకారుల అవసరం నేటి సినీ పరిశ్రమకు ఉంది. అలాంటి తరానికి ప్రతినిధిగా వియాన్ ఎస్‌ఎ ఎదుగుతున్నారు. ‘తెనాలి నుంచి ప్రారంభమైన నా ఈ స్వర ప్రయాణం మరింత దూరం సాగాలి. మంచి చిత్రాలు, గుర్తుండిపోయే పాటలు, ప్రయోగాత్మక సంగీతంతో ఓ ప్రత్యేక అధ్యాయాన్ని రాయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నా’ అని ఇంటర్వ్యూలో వియాన్ ఎస్‌ఎ వెల్లడించారు.
- యడవల్లి శ్రీనివాసరావు








కామెంట్‌లు (0)