- దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పథకం
ప్రజాశక్తి - మంగంపేట(తిరుపతి జిల్లా): వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజివికా మిషన్‌న(విబి గ్రామ్ జి పథకం) ద్వారా రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేటలో విబి గ్రామ్ జి పథకంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు ప్రసంగించారు. దేశవ్యాప్తంగా అమలుకానున్న ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని రైల్వే కోడూరు నుంచే ప్రారంభించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. గతంలో నరేగా పథకం కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైందని, ఇప్పుడు విబి గ్రామ్ జి పథకం కూడా ఇక్కడి నుంచే ఆవిష్కృతమవుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4,000 కోట్లతో ఈ పథకం కింద అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈ కార్యక్రమం అమలై గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ పథకం కింద 125 పనిదినాలతో గ్రామీణాభివృద్ధికి అవసరమైన రహదారులు, డ్రైనేజీలు, కాలువలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి అవకాశం ఉంటుందని వివరించారు. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి పూర్తిస్థాయి పారదర్శకతతో అమలు చేస్తామని స్పష్టం చేశారు. గాలేరు–నగరి ప్రాజెక్టు నుంచి కోడూరుకు తాగునీటిని తీసుకువస్తామని, జలధార కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందిస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రాల భాగస్వామ్యం భారం కాదని, బాధ్యతగా భావించాలని అన్నారు. రాష్ట్రంలోని 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి గిన్నీస్ రికార్డు సృష్టించిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కే దక్కిందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకు 7,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1.07 లక్షల ఫార్మ్ పాండ్లు, 1,373 కిలోమీటర్ల గిరిజన ప్రాంత రహదారులు, 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. అలాగే 55.44 కోట్ల పనిదినాలు కల్పించి రూ.16,695 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 వేల కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల సిమెంట్, బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల మేజిక్ డ్రైన్లు, లక్ష ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు అవసరమైన డొంక రోడ్లను కూడా విబి గ్రామ్ జి పథకం కింద నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
పథకం ప్రారంభోత్సవం అనంతరం లబ్ధిదారులకు వీబీజీ రామ్ జీ జాబ్ కార్డులను సీఎం, కేంద్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి అందజేశారు. అలాగే విబి గ్రామ్ జి పథకానికి సంబంధించిన సమాచార బుక్‌లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్, మిషన్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే శ్రీధర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)