టిడిపి వారిపై సాధారణ దాడి కేసు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : తాడేపల్లి మండలం ఉండవల్లిలో శనివారం టిడిపి, వైసిపి నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరుగ్రూపుల ఫిర్యాదులపై పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. వైసిపి వారిపై నాన్ బెయిల్ బుల్ కేసులు, టిడిపి వారిపై సాధారణ కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. తన విధులకు వైసిపి నాయకులు ఆటంకం కలిగించారంటూ, తనను తోసివేశారంటూ తాడేపల్లి సిఐ పి.వీరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసిపి నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, పానుగంటి చైతన్య, మరికొంత మందిపై అండర్ సెక్షన్ 223, 132, 30, 30 (ఎ) పోలీసు యాక్డు కింద కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలపై సెక్షన్ 30 ఉల్లంఘన కేసు కూడా నమోదైంది. వైసిపి నాయకులు అంబటి రాంబాబు, పానుగంటి చైతన్య, డైమండ్ బాబు, వేమారెడ్డి, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి, నూనే ఉమామహేశ్వరరెడ్డి, మేకా శివారెడ్డి, మరికొంతమంది కలిసి ఉండవల్లి అమ్మ హోటల్ సెంటర్‌లో తనతోపాటు రాయిపూడి కిరణ్ ను అడ్డుకున్నారంటూ, తమను కులం పేరుతో దూషించారంటూ పెనుమాక గ్రామానికి చెందిన తెనాలి మాణిక్యం అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసిపి నాయకులపై పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాజధాని పర్యటనకు వెళ్తున్న తమ నాయకులపై టిడిపి నాయకులు దాడి చేశారంటూ వైసిపి నాయకులు ఆరోపించగా, విధుల్లో ఉన్న పోలీసులపై వైసిపి వారు దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
హెడ్ కానిస్టేబుల్ పై టిడిపి వారు దాడి చేసినట్లు కేసు
డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై టిడిపి వారు దాడి చేసినట్లు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అయితే, దాడికి పాల్పడిన వ్యక్తి పేరు పోలీసులు చెప్పడం లేదు.
హెడ్ కానిస్టేబుల్ పై రాయితో దాడి చేసింది రాయిపూడి కిరణ్ అని వైసిపి వారు ఆరోపిస్తున్నారు. వైసిపి నాయకుల కార్ల ధ్వంసంపై ఆ పార్టీ నాయకులు నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంతమంది టిడిపి కార్యకర్తలపై దాడి కేసు నమోదైంది. వైసిపి నాయకుల పర్యటనలో ముగ్గురు రౌడీషీటర్లు పాల్గొన్నట్లు గుర్తించామని, గతంలో టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వీరు ప్రధాన నిందితులని పోలీసులు తెలిపారు.









కామెంట్‌లు (0)