mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘అయోధ్య’ కుంభకోణం..

3 గంటల క్రితం

Ayodhya Scam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 05:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

జనమందరికీ శకునం చెప్పే బల్లి తానే కుడితిలో పడిందన్న సామెత బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ, సంఘ పరివారానికి సరిగ్గా నప్పుతుంది. మేం తినం వేరొకర్ని తిననివ్వం అంటూ పొద్దున లేచింది మొదలు అవినీతిపై సూక్తి ముక్తావళి వల్లించే కాషాయ పెద్దలకు అయోధ్య రామాలయంలో దొంగల ఉదంతం గంగ వెర్రులెత్తిస్తున్నది. బాల రామునికి భక్తులు, దాతలు ఎంతో విశ్వాసంతో సమర్పించిన వజ్రాల వంటి విలువైన వస్తువులు, రూ.200 కోట్ల చోరీ పెను సంచలనమైంది. ఇంటి దొంగల ఈ నిర్వాకాన్ని బయట పెట్టింది కూడా అయోధ్య రామాలయ ట్రస్ట్‌ ‌వారే కావడం విశేషం. ఆలయ ట్రస్టు సభ్యుడొకరు ఇచ్చిన ఫిర్యాదుపై రామ జన్మభూమి పోలీస్‌ ‌స్టేషన్‌‌లో నిధుల దుర్వినియోగం, మోసం, విశ్వాస ఉల్లంఘన, నేర పూరిత కుట్ర వంటి బిఎన్‌ఎస్‌‌లోని సెక్షన్ల కింద ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదైంది. యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని యుపి బిజెపి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)‌ను ఏర్పాటు చేసి అభియోగాలెదుర్కొంటున్న వారిని అరెస్టు చేసింది. ఈ పరిణామంతో ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌‌ రాయ్‌, ట్రస్టు సభ్యుడు అనిల్‌ ‌మిశ్రా రాజీనామా చేశారు. ఇంకో వైపు ఆలయంలో దొంగతనంపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది.

తమకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అయోధ్య గుడిలో తమ వారే భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేసి పెద్ద ఎత్తున కానుకలు, నగదు ఎత్తుకుపోయిన వ్యవహారంపై బిజెపి కాని, ప్రధాని నరేంద్ర మోడీ కాని స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. చీమ చిటుక్కుమన్నా మన్‌ ‌కీ బాత్‌, చాయి పే చర్చాలను నిర్వహించే ప్రధానికి అయోధ్యలో ఇంటి దొంగల దోపిడీ చర్చనీయాంశం కాకపోవడం ఆశ్చర్యమే! అయోధ్య ఆలయంలో చోరీపై యోగి సర్కార్‌ ‌నియమించిన సిట్‌ కంటి తుడుపు చర్యగా ప్రతిపక్షాల నుంచే కాదు సాధు సంతుల నుంచి, విహెచ్‌‌పి వంటి హిందూ సంస్థల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సూత్రధారులు, పాత్ర ధారులను రక్షించి, కింది స్థాయి సాధారణ ఉద్యోగులపై కేసు నెట్టేసేందుకే సిట్‌ ‌అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలైన నిందితులెవరో నిగ్గు తేలాలంటే నిష్పక్షపాత సిట్టింగ్‌ ‌జడ్జితో న్యాయ విచారణ జరపాలి. రాజకీయ, ప్రతిష్టాత్మక కేసు అయినందున దర్యాప్తుపై న్యాయస్థానం పర్యవేక్షణ ఉండాలన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆ విధంగా కేంద్రం, యుపి ప్రభుత్వం తూతూ మంత్రంలా కానిస్తే సత్యానికి పాతరేసి, నిందితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాపాడుతున్నాయన్న భావన కలుగుతుంది.

బిజెపి ఏలుబడిలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో అవినీతి, అక్రమాలకు హద్దు లేకుండా పోతోంది. వ్యవసాయ మంత్రి ఒక రాయితీ ఇప్పించేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణ వచ్చింది. మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి భూ కుంభకోణానికి పాల్పడ్డారనన్న విమర్శ వెలువడింది. అదే రాష్ట్రంలో గతంలో ఉద్యోగుల నియామకాల్లో వెలుగు చూసిన వ్యాపం స్కాం ఉండనే ఉంది. అక్కడి దాకా ఎందుకు, కరోనా సమయంలో ‘పిఎం కేర్‌’ విరాళాలపై ఆరోపణలొచ్చాయి. అదానీ అవినీతి గురించి చెప్పనవసరం లేదు. నీట్‌ సహా పలు పరీక్ష పత్రాల లీకేజిలకు బిజెపి ప్రభుత్వాల అవినీతే హేతువు. కేవలం సాంకేతిక కారణాల వలన రాఫెల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మోడీ ప్రభుత్వం తప్పించుకుంది. ఐపిఎల్‌ ‌కుంభకోణం కింగ్‌‌పిన్‌ లలిత్‌ ‌మోడీ వ్యవహారం సరేసరి! కర్ణాటకలో మైనింగ్‌ ‌మాఫియాను నడిపిన గాలి జనార్దన్‌‌రెడ్డికి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అవినీతిని పెంచి పోషించింది బిజెపి నాయకత్వమే. చెప్పుకుంటూ పోతే బిజెపి పాలనలో అవినీతి చిట్టా కొండవీటి చాంతాండంత. ఇంతటి అవినీతి పంకిలంలో పొర్లాడుతూ తాము పునీతులమనడం బిజెపికి, ప్రధానికే చెల్లింది. అయోధ్యలో చోరీపై సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్న చంద్రబాబు, పవన్‌ ‌కళ్యాణ్‌ ‌కిమ్మనడంలేదు. ఇప్పటికైనా అయోధ్య ఆలయంలో కుంభకోణంపై ప్రధాని మోడీ, బిజెపి, యుపి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి సమగ్ర దర్యాప్తునకు ముందుకు రావాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్