సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విజయవాడ కృష్ణలంక పోలీస్టేషన్‌లో పోలీసుల దాష్టీకంతో మృతి చెందిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ తెర వెనుక భూ వివాదాలు, ఇందులో భాగస్వాములైన రాజకీయ నేతలు, ఇతర పోలీసు అధికారుల పాత్రపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రెండు రోజులపాటు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. సాయికృష్ణ లాకప్ డెత్ తెర వెనుక భూ కుంభకోణాలు, కొందరు రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల పాత్రపై అనేక వార్తలొస్తున్నాయని తెలిపింది. పోలీసులతోపాటు అనేకమంది ప్రైవేటు వ్యక్తుల పాత్ర పైన నిర్దిష్ట సమాచారం ఇప్పటికే వెల్లడైందని, అనేక కేసుల్లో ముద్దాయిలైన వ్యక్తులను పోలీసులు, రాజకీయ పెద్దలు తమ అవసరాలకు వినియోగించుకున్నట్లుగా కథనాలొస్తున్నాయని పేర్కొంది. కృష్ణలంక సిఐ మాత్రమే కాకుండా అనేక మంది పోలీసులు, ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు అనేక పరిమితులు ఉన్నాయని, పూర్తిస్థాయి విచారణ పోలీస్ అధికారులతో కూడిన సిట్ చేయలేదని, లాకప్ డెత్ కారకులైన పోలీసులే కాకుండా రాజకీయ నేతలు, బయట వ్యక్తుల పాత్రపై వాస్తవాలు బయటికి రావాలంటే సమగ్రమైన న్యాయ విచారణ అవసరమని తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని సర్వత్రా ప్రజలు భావిస్తున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే న్యాయ విచారణకు ఆదేశించాలని, ఇందులో భాగస్వాములైన పోలీసులు, రాజకీయ నేతలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా అందరిపైనా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.









కామెంట్‌లు (0)