mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

1 గంట క్రితం

doctor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 11:18 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- హోమియో వైద్యులు సోమశేఖర్

ప్రజాశక్తి - జగ్గంపేట : వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భాను హోమియో హాస్పిటల్ వైద్యులు పి. సోమశేఖర్ సూచించారు. ప్రజాశక్తితో ఆయన కాసేపు ముచ్చటించారు. వర్షాకాలం ప్రారంభమవగానే ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతుంది. అయితే ఈ కాలంలోనే అనేక అంటువ్యాధులు, వైరల్ జ్వరాలు, జీర్ణాశయ సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. వర్షపు నీరు నిల్వ ఉండటం, కలుషిత తాగునీరు, ఆహార పరిశుభ్రత లోపించడం, దోమల పెరుగుదల వల్ల ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అన్నారు. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు, డెంగ్యూ, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటిలో చాలా వరకు సరైన జాగ్రత్తలతో నివారించగలిగేవే అన్నారు.


వైరల్ జ్వరాలను నిర్లక్ష్యం చేయవద్దు

వర్షాకాలంలో ఉష్ణోగ్రతల మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు వేగంగా వ్యాపిస్తాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతు నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అయితే జ్వరం రెండు లేదా మూడు రోజుల కంటే ఎక్కువ కొనసాగితే వైద్యులను సంప్రదించడం అవసరం అని సూచించారు.


డెంగ్యూ నివారణే ఉత్తమ మార్గం

డెంగ్యూ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇంటి చుట్టూ నిల్వ ఉన్న నీరు దోమల పెరుగుదలకు కారణమవుతుంది. అధిక జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ విషయంలో స్వీయ వైద్యం ప్రమాదకరం అని తెలిపారు.


కలుషిత నీరు అనేక వ్యాధులకు కారణం

వర్షాకాలంలో కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్, అతిసారం, వాంతులు, జీర్ణాశయ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. కాబట్టి మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. బయట ఆహారం తినేటప్పుడు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అని సూచించారు.


చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి

తేమ అధికంగా ఉండే వాతావరణం ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురదలు మరియు ఇతర చర్మవ్యాధులకు అనుకూలంగా ఉంటుంది. శరీరాన్ని పొడిగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన దుస్తులు ధరించడం ద్వారా వీటిని నివారించవచ్చని తెలిపారు.


హోమియోపతి పాత్ర

హోమియోపతి వైద్యం రోగి లక్షణాలు, శారీరక తత్వం, రోగనిరోధక శక్తిని పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిస్తుంది. ప్రతి వ్యక్తికి వ్యాధి లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు కాబట్టి మందుల ఎంపిక కూడా వ్యక్తిగతంగా జరుగుతుంది. అర్హత కలిగిన హోమియోపతి వైద్యుని సలహాతో చికిత్స తీసుకోవడం మంచిది అన్నారు. వర్షాకాలంలో ఆరోగ్య పరిరక్షణ ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకోవాలన్నారు. పరిశుభ్రత, సరైన ఆహారం, స్వచ్ఛమైన నీరు సమయానికి వైద్య సలహా ద్వారా చాలా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు.


ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు

మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి

దోమతెరలు, దోమల నివారణ చర్యలు పాటించాలి వేడిగా తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.


చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి

జ్వరం, విరేచనాలు లేదా ఇతర లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సూచనలు పాటించాలి.

వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని సూచించారు.


- డా. సోమశేఖర్, BHMS, MBA (Hospital Administration)

భాను హోమియోపతి హాస్పిటల్, జగ్గంపేట

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్