mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బహుముఖ ప్రజ్ఞాశాలి కె.భాగ్యరాజ్‌ కన్నుమూత

3 రోజుల క్రితం

bhagya raj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 09:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటుడు, దర్శకుడు, కథా రచయితగా సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ మృతితో దక్షిణ భారత సినీ రంగం విషాదంలో మునిగిపోయింది.

1953 జనవరి 7న తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లన్‌కోయిల్ గ్రామంలో కృష్ణస్వామి, అమరావతి అమ్మాళ్ దంపతులకు జన్మించిన భాగ్యరాజ్, దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఎదిగి తమిళ సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి సినీ ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల జీవితం, హాస్యం, భావోద్వేగాలను మేళవించిన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందుకే ఆయనను తమిళ సినీ పరిశ్రమలో 'స్క్రీన్‌ప్లే కింగ్', 'వన్ మ్యాన్ స్టూడియో' అని పిలిచేవారు. సుమారు 75 చిత్రాల్లో నటించిన ఆయన 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. చాలా చిత్రాలకు కథ, సంభాషణలు అందించారు. 1983లో విడుదలైన 'ముంధనై ముడిచ్చు' చిత్రంలో నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. 1981లో నటి ప్రవీణను వివాహం చేసుకున్న భాగ్యరాజ్, ఆమె 1983లో మరణించడంతో 1984లో నటి పూర్ణిమను వివాహం చేసుకున్నారు. 'డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్' చిత్రంలో ఆమె ఆయన సహనటిగా నటించారు. వీరికి శరణ్య భాగ్యరాజ్, శంతను భాగ్యరాజ్ సంతానం. శరణ్య 'పారిజాతం', శంతను 'సక్కరకట్టి' చిత్రాల ద్వారా సినీరంగంలో అడుగుపెట్టారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా భాగ్యరాజ్ సుపరిచితుడే. 'చిలిపి పెళ్లాం' (1990), 'మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు' (2004), 'మేం వయసుకు వచ్చాం' (2012), 'డిటెక్టివ్' (2017), 'అల్లంత దూరాన' (2023), '35 చిన్న కథ కాదు' (2024), 'కుబేర' (2025) చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. సినీ రంగంతో పాటు 'భాగ్య' వారపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించిన ఆయన పలు నవలలు కూడా రచించారు. నటుడు, దర్శకుడు, కథా రచయితగా దక్షిణ భారత సినీ పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన భాగ్యరాజ్ మరణం సినీ రంగానికి తీరని లోటుగా పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్