ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి రాంభూపాల్ రచించిన ‘పుష్కర కాల మోడీ పాలనలో తిరోగమనం’ పుస్తకాన్ని విజయవాడలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, యు వాసుకి సోమవారం ఆవిష్కరించారు. 2020-26 మధ్య ఆరేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ప్రచారం కోసం రూ.2,586 కోట్ల చిల్ల పెంకుల్లా ఖర్చు చేసింది. మోడీ సమర్ధవంతమైన, గొప్ప పాలకుడని, దేశదేశాల అధినేతలు మోడీని విశ్వగురువుగా పరిగణిస్తారని ప్రజానీకాన్ని నమ్మించడానికి రాత్రీపగలూ శక్తివంచన లేకుండా సాగుతున్న ప్రచార హోరును ఈ పుస్తకం పటాపంచలు చేస్తుంది. ‘సబ్ కే సాథ్ సబ్ కా వికాస్’ నినాదం పేరిట దేశ ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా చూస్తానని అధికారం చేపట్టిన మోడీ నాయకత్వంలోని బిజెపి, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఆచరణలో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రజల మీద పన్నులపై పన్నులు విధిస్తూ వారి ఆదాయాలను పీల్చి పిప్పి చేస్తుందని బట్టబయలు చేస్తుంది ఈ పుస్తకం. నిత్యావసరాల ధరలు 300 శాతం పెరిగాయని, గత పన్నెండేళ్లలో ప్రజల నుండి రూ.329 లక్షల కోట్ల అధిక పన్ను వసూళ్లకు పాల్పడిందని, మోడీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.191 లక్షల కోట్లకు ఎగబాకి 140 కోట్ల మంది భారతీయులపై తలకు రూ.1.80 లక్షల అప్పు మిగిల్చిందని, ఏటా 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం ఒట్టి బూటకమని, నిరుద్యోగం 25 శాతానికి పెరిగిందని, గత పన్నెండేళ్లలో ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు, నియామకాల ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు 70కి పైగా లీక్ అయ్యి విద్యార్థులు, ఉద్యోగార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుకున్నదని, మహిళలు, దళితులు, మత మైనారిటీలపై దాడులు పెరిగి మత సామరస్య భావన పెను ప్రమాదంలో పడిందని ససాక్ష్యంగా తెలియజెప్పే పుస్తకం ఇది.
Print Edition‘పుష్కర కాల మోడీ పాలనలో తిరోగమనం’ పుస్తకావిష్కరణ
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 11:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)