mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిట్‌ ‌నివేదికకు 3 వారాల గడువు

12 గంటల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 10:59 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక సమర్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టు మరో మూడు వారాల గడువు మంజూరు చేసింది. సోమవారం విచారణ ప్రారంభమైన వెంటనే సిట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, కేసు దర్యాప్తునకు సంబంధించిన మధ్యంతర నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచామని, తుది నివేదిక సమర్పించేందుకు మరో మూడు వారాల సమయం ఇవ్వాలని కోరారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ కోర్టుకు వివరణ ఇస్తూ, ఇప్పటికే 80 శాతం మంది అభ్యర్థుల జవాబు పత్రాల ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని, మిగిలిన 20 శాతం అభ్యర్థులకు సంబంధించిన నివేదిక సిమ్లా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రావాల్సి ఉందని తెలిపారు.

పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు మరికొంత గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. సీల్డ్ కవర్‌లో సమర్పించిన మధ్యంతర నివేదికను పరిశీలించిన ధర్మాసనం సిట్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని తుది నివేదిక దాఖలు చేసేందుకు వీలుగా అప్పీళ్ల విచారణను జులై 24కు వాయిదా వేసింది. సిట్ సమర్పించిన నివేదికను భద్రపరచాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షలో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు ఎంపిక కాని అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై ధర్మాసనం విచారణ జరుపుతోంది. జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణలను తేల్చేందుకు డిజి స్థాయికి తగ్గని అధికారితో సిట్‌ను ఏర్పాటు చేసిన ధర్మాసనం, ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఫోకల్ పోస్టుల నుంచి నాన్‌ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన విచారణకు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ వ్యక్తిగతంగా హాజరయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్