కేంద్ర గిరిజన విద్యాలయం ప్రధమ స్వర్ణోత్సవాల సందర్భంగా పోలీస్ కేసులు ఉన్నాయని గిరిజన విద్యార్థులను బయటికి పంపించేసిన పోలీసులు
'మా భవిష్యత్తేంటి ?` : గిరిజన విద్యార్థులు
పట్టాలిస్తామని పిలిచి.. క్రిమినల్ కేసులున్నాయంటూ .. విద్యార్థులను ఆపేసిన పోలీసులు
విశాఖ : కేంద్ర గిరిజన విద్యాలయం ప్రధమ స్వర్ణోత్సవాల సందర్భంగా .... పట్టాలు పుచ్చుకునేందుకు వచ్చిన విద్యార్థులలో కొందరు గిరిజన విద్యార్థులను పోలీసులు బయటికి పంపేసిన వైనం మంగళవారం విశాఖలో జరిగింది. కోవిడ్ సమయంలో పేషెంట్లకు సాయం చేయడానికి వెళ్లిన విద్యార్థులను పోలీసులు ఆపి కేసులు పెట్టారు.. ఆ కేసులను క్రిమినల్ కేసులుగా అభివర్ణించి 9మందిని బయటే ఆపేశారు.. వారిలో ఇద్దరు విద్యార్థులను మాత్రం ఎబివిపి కి చెందినవారంటూ .... ఎసిపి లోపలికి పంపారు. మిగతా ఏడుగురు యూనివర్సిటి స్వర్ణోత్సవాల బయటే నిలుచుండిపోయారు. తమ భవిష్యత్తు ఏమిటి ? అంటూ ఆ విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా .... కేంద్ర గిరిజన విద్యాలయం ప్రధమ స్వర్ణోత్సవాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు నిఖిల్, రాము, సాయి, తేజ లను అరెస్ట్ చేశారు.
బాధిత విద్యార్థి మాట్లాడుతూ .... 2025 లో మార్షల్ సైన్స్ డిపార్ట్మెంట్ నుండి రిలీవ్ అయి ఉన్నానని, ఈరోజు రాష్ట్రపతి వస్తారు.. స్నాతకోత్సవం జరుగుతుంది.. వారి చేతులమీదుగా మీకు పట్టాలిస్తాం.. అని తమను ఇక్కడికి తీసుకువచ్చారని, ఆ తరువాత నడిరోడ్డు మీద కేంద్ర గిరిజన విద్యాలయ యాజమాన్యం వదిలేసిందన్నారు. తమపై క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారని, 2019-20 కోవిడ్ సమయంలో పెట్టిన డిజాస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసులు కూడా క్రిమినల్ కేసుల కింద ఎలా వస్తాయి ? అని ప్రశ్నించారు. అప్పటి కేసులను లోక్ అదాలత్ లో అవే సంవత్సరంలో కొట్టేశారని తెలిపారు. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకొని నెల రోజుల నుండి తమ ఉద్యోగాలకు సెలవులను పెట్టుకొని పట్టాల కోసం వచ్చిన తరువాత ఇలా నడిరోడ్డుపై వదిలేయడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. పోలీస్ యంత్రాంగం కానీ, యూనివర్సిటీ యాజమాన్యం కానీ ఆలోచించాలని కోరారు. తమ తల్లిదండ్రులను కూడా వెంట తీసుకురావాలని యాజమాన్యం చెప్పడంతో అలాగే వచ్చామన్నారు. తమను బస్సుల్లో తీసుకొచ్చి ఇప్పుడు నడిరోడ్డుపై వదిలేస్తే తమ భవిష్యత్తు ఏం కావాలి ? అని ప్రశ్నించారు. నిజంగా తమపై క్రిమినల్ కేసులుంటే ఆపాలని కోరారు. ఇక్కడికొచ్చిన 380 మంది విద్యార్థుల్లో 9మందిపై క్రిమినల్ కేసులున్నాయని అన్నారని, అయితే వారిలో ఇద్దరు లోపలికి వెళ్లారని ... వారు ఎలా వెళ్లారు ? అని నిలదీశారు. వారు బిజెపి విద్యార్థి అనుబంధ సంఘ నాయకులు కాబట్టి వెళ్లగలిగారని అంటే ... బిజెపితో సంబంధాలుంటే వారిపై ఎలాంటి కేసులున్నా వారిని లోపలికి పంపిస్తారా ? అని అడిగారు. ఎబివిపి లో ఉన్నారంటూ.. ఇద్దరిని ఇదే విశాఖ ఎసిపి లక్ష్మణమూర్తి లోపలికి పంపారని తెలిపారు. అంటే... వారి ద్వారా రాష్ట్రపతికి ఎలాంటి హానీ జరగదా ? అని ప్రశ్నించారు. విద్యార్థులుగా తాము 2019 లో కోవిడ్ పేషెంట్లకు సాయం చేయడానికి వెళితే పెట్టిన కేసులు క్రిమినల్ కేసుల్లా కనిపిస్తున్నాయా ? అని అడిగారు. ఏడుగురు విద్యార్థులం తామంతా బయటే ఉన్నామని, తమను లోపలికి పంపి తామంతా కష్టపడి చదువుకున్న పిజి పట్టాలను తమకు అందజేయాలని కోరారు.








కామెంట్‌లు (0)