mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యూట్యూబ్ వీడియోలను చూసి ఇంట్లో ప్రసవం .. తర్వాత ..!

1 గంట క్రితం

Home delivery after watching YouTube videos... and then...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తమిళనాడు : తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్ వీడియోలను ఆధారంగా చేసుకుని ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించిన ఓ మహిళ ప్రసవానంతర సమస్యలతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తిరుప్పూర్ జిల్లాలో చోటుచేసుకోగా, వైద్యుల పర్యవేక్షణ లేకుండా ప్రసవం చేయడం ఎంత ప్రమాదకరమో మరోసారి వెలుగులోకి వచ్చింది.


అసలు ఏం జరిగిందంటే ....

తిరుప్పూర్ జిల్లా ఉతుకుళి తాలూకాలోని పుంజైతలవాయిపాలయానికి చెందిన 32 ఏళ్ల శశికళకు జూన్ 24న పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే ఆసుపత్రికి వెళ్లకుండా, యూట్యూబ్‌లో సహజ ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూసిన తర్వాత ఇంట్లోనే ప్రసవం చేయాలని ఆమె కుటుంబం నిర్ణయించింది. పోలీసుల సమాచారం ప్రకారం .... ఆమె భర్త కోలందచామి (35), అత్తగారి సహాయంతో ఇంట్లోనే ప్రసవం నిర్వహించారు. ఈ ప్రసవంలో శశికళ ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డ జన్మించిన తర్వాత ప్లాసెంటా (మాయ) పూర్తిగా బయటకు రాకపోవడంతో శశికళకు తీవ్రమైన ప్రసవానంతర రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె ఆరోగ్యం విషమించడంతో వెంటనే పెరుందరైలోని ప్రభుత్వ ఈరోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆరోగ్యం క్షీణించి జూన్ 28న ఆమె మరణించింది. ఈ ఘటనపై కున్నత్తూరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉతుకుళి పోలీసులు శశికళ భర్త కోలందచామిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ... ఈ దంపతులకు ఇప్పటికే ఆరేళ్ల కుమార్తె ఉంది. మొదటి బిడ్డ 2020లో సిజేరియన్ ద్వారా జన్మించగా, ఆ తర్వాత శశికళ ఆరోగ్యం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ అనుభవం కారణంగా రెండోసారి సహజ ప్రసవం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే వైద్యులను సంప్రదించకుండా, యూట్యూబ్ వీడియోలను మాత్రమే నమ్మి ఇంట్లో ప్రసవం నిర్వహించడం చివరకు విషాదానికి దారితీసింది. ఈ ఘటన సోషల్ మీడియా లేదా యూట్యూబ్‌లోని సమాచారాన్ని మాత్రమే నమ్మి వైద్య సలహాలను విస్మరించడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్