జెనీవా : అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ నెల 21 నుంచి 28 వరకు ఐరోపాలో 1300 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నాడు సామాజిక మాధ్యమాల్లో ఆయన ఒక ప్రకటన పోస్టు చేశారు. ‘ప్రస్తుతం 15 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిలో జీవిస్తున్నారు, వందలాది మంది మరణించారు, పాఠశాలలు మూతపడ్డాయి, విద్యుత్ గ్రిడ్లు కుప్పకూలుతున్నాయి’ అని టెడ్రోస్ తెలిపారు. అధిక వేడిని తరచుగా 'నిశ్శబ్ద హంతకుడు'గా పిలుస్తారని, యూరోపియన్ దేశాల్లో గృహాలు, కార్యాలయాలు, పాఠశాలలు ఈ ఉష్ణోగ్రతలకు తగినట్లుగా నిర్మితం కాకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భూగోళంపై అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండం ఐరోపా అని, ఇది ప్రపంచ సగటు కంటే రెండింతలు వేగంగా వేడెక్కుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా, యుగానికి ఒకసారి వచ్చే వడగాలులు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉంటున్నాయని ఆయన హెచ్చరించారు. తీవ్రమైన వేడి వల్ల కలిగే ఆరోగ్య ముప్పులను ఎదుర్కోవడానికి, సంసిద్ధత, నివారణ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ ప్రతిస్పందనలపై డబ్ల్యుహెచ్ ముందుగానే దృష్టి సారించి భాగస్వామ్యులతో కలిసి పని చేస్తోందన్నారు. తీవ్రమైన వేడి సమయంలో చల్లగా ఉండేందుకు తమ సంస్థ వెబ్సైట్లో ఆచరణాత్మక చిట్కాలను ప్రచురించినట్లు పేర్కొన్నారు. పగటిపూట అత్యంత వేడిగా ఉండే సమయంలో బయట కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నీడలో ఉండటం, ప్రతిరోజూ రెండు నుండి మూడు గంటల పాటు చల్లని ప్రదేశంలో గడపడం ద్వారా వేడికి దూరంగా ఉండాలని డబ్ల్యుహెచ్ఒ తన మార్గదర్శకాల్లో సూచినట్లు ఆయన తెలిపారు.









కామెంట్లు (0)