అమరావతి : దేశవ్యాప్తంగా భానుడి భగభగలు, ఉక్కపోతతో ఇబ్బందులుపడుతున్న ప్రజలకు, వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. గత కొన్ని వారాలుగా మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారాయని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడనున్న రెండు బలమైన అల్పపీడనాలు, రుతుపవన ద్రోణిలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ నెలలో నమోదైన వర్షపాత లోటును కూడా ఈ వర్షాలు గణనీయంగా భర్తీ చేసే అవకాశముందని అంచనా వేసింది.
ఉత్తర భారతానికి ఉపశమనం
చాలా రోజులుగా పొడి వాతావరణం, తీవ్ర వేడి గాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉత్తర భారత రాష్ట్రాలకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం హిమాలయాల పాద ప్రాంతాల వద్ద ఉన్న రుతుపవన ద్రోణి క్రమంగా దక్షిణ దిశగా కదలనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి, జూలై తొలి వారంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ముంబైపై భారీ వర్షాల ముప్పు
బంగాళాఖాతంలో ఏర్పడే వరుస అల్పపీడనాలు మధ్య భారతం గుండా ప్రయాణించనున్న నేపథ్యంలో తూర్పు, మధ్య, పశ్చిమ భారత రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత మరింత పెరగనుంది. ముఖ్యంగా ముంబై మహానగరం మరోసారి భారీ వర్షాలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. వారాంతానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలో సుమారు 500 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రైలు, రోడ్డు రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
వ్యవసాయానికి వరం.. జలాశయాలకు జీవం
జూన్‌లో తగినంత వర్షపాతం లేకపోవడంతో దేశంలోని అనేక ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. అయితే తాజా వాతావరణ పరిణామాలతో పరిస్థితి మారే అవకాశముంది. ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు ఎంతో అనుకూలంగా మారనున్నాయి. వరి, సోయాబీన్, పత్తి వంటి ప్రధాన పంటలకు తగిన తేమ లభించడంతో రైతులకు ఊరట కలగనుంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున పొలాలు నీట మునిగే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు స్థానిక వాతావరణ సూచనలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
5 డిగ్రీల వరకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
వాతావరణ నమూనాల ప్రకారం .... జూలై 1 నుంచి 5వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం మరింత బలపడనుంది. దీంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో తీవ్ర ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించి, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.









కామెంట్‌లు (0)