mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఖతార్‌‌ సమావేశంపై అనిశ్చితి

15 గంటల క్రితం

katar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • చర్చలు వున్నాయన్న అమెరికా,* లేవన్న ఇరాన్‌

  • ఖతార్‌‌లో ఆస్తులు తక్షణమే విడుదల చేయాలని కోరిన ఇరాన్‌ అధ్యక్షుడు

టెహ్రాన్‌, వాషింగ్టన్‌ : పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడాన్ని నిలిపివేసేందుకు అమెరికా, ఇరాన్‌‌లు అంగీకరించాయని, మంగళవారం ఖతార్‌‌లో జరగాల్సిన సమావేశం జరుగుతుందని అమెరికా సోమవారం ప్రకటించింది. హర్మూజ్‌ ‌జలసంధిపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఈ సమావేశం జరగనుంది. తాజా అంశాలపై చర్చించేందుకు సమావేశానికి రావాల్సిందిగా ఇరాన్‌ ‌కోరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్‌ ‌మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఇరాన్‌ అధికారులు దీన్ని తిరస్కరించారు. అలాంటి సమావేశమేదీ లేదని టెహ్రాన్‌ ‌ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఎలాంటి సాంకేతిక చర్చలు, సమావేశాలు జరుగతాయని భావించడం లేదని పేర్కొంది. ఒప్పందం అమలుపై చర్చించేందుకు అమెరికా, ఇరాన్‌ ‌సాంకేతిక బృందాలు సమావేశమవుతాయని వచ్చిన వార్తలను ఇరాన్‌ ‌విదేశాంగ శాఖ తిరస్కరించింది. ఈ వారంలో అలాంటి సమావేశాలేవీ జరగబోవని డిప్యూటీ విదేశాంగ మంత్రి కజెమ్‌ ‌ఘరిబాదాది చెప్పారు. ఖతార్‌‌లో స్తంభింపచేసిన 600కోట్ల డాలర్ల ఇరాన్‌ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ ‌పెజెష్కియాన్‌ ‌కోరారు. కాగా ఇరాన్‌ ఆస్తుల విషయమై అమెరికా అధికారులు ఇంతవరకు ఎలాంటి ప్రకట చేయలేదు.

హర్మూజ్‌ బాధ్యత మాదే : అరాగ్చీ

హర్మూజ్‌ జలసంధి బాధ్యత పూర్తిగా తమదేనని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టం చేశారు. రాబోయే 30 రోజులు హర్మూజ్‌ తమ అధీనంలోనే ఉంటుందని తెలిపారు. జలసంధి నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోవద్దని అన్ని పక్షాలను కోరారు. అమెరికాతో కుదిరిన ఎంఒయూ ప్రకారం హర్మూజ్‌ పై నియంత్రణ తమదేనని స్పష్టం చేశారు. జలసంధిలో తాము సూచించిన మార్గాన్ని ఖాతరు చేయకపోతే ఉద్రిక్తతలు, సైనిక చర్యలు పెరుగుతాయని హెచ్చరించారు. ప్రాంతీయ భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటు కోసం గల్ఫ్‌ దేశాలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమేనని అన్నారు. ఇటీవలి పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ప్రాంతీయ భవిష్యత్‌ భద్రతా నిర్మాణానికి రూపు ఇచ్చేందుకు కలసి రావాలని గల్ఫ్‌ దేశాలకు సూచించారు. మరోవైపు ఖ్వోమ్‌ నగరంలో పర్యటించిన ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ అమెరికాతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం ఇరాన్‌ ప్రజల విజయమన్నారు. ఖతార్‌లో అమెరికా స్తంభింపజేసిన 12 బిలియన్‌ డాలర్ల ఇరాన్‌ ఆస్తులలో ఆరు బిలియన్‌ డాలర్లను అమెరికా విడుదల చేసి వాపసు చేస్తుందని చెప్పారు. ఇదిలావుండగా ఇరాన్‌, ఒమన్‌ దౌత్యవేత్తలు మస్కట్‌లో సమావేశమై హర్మూజ్‌ పై నియంత్రణ గురించి చర్చించారు. హర్మూజ్‌ ద్వారా ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై దాడితో ఘర్షణలు పెరగటంతో జలసంధి నుండి రాకపోకలు తగ్గిపోయాయి. సముద్రయాన పర్యవేక్షణ సంస్థ కెప్‌‌లర్ నుండి అందిన సమాచారం ప్రకారం, శనివారం మొత్తం 29 సరుకు రవాణా నౌకలు దాటగా, ఆదివారం 12 నౌకలు మాత్రమే ప్రయాణించాయి. గత వారం టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కారణంగా జలసంధి గుండా రాకపోకలు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక స్థాయికి పెరిగి, బుధవారం నాటికి 70 క్రాసింగ్‌లకు చేరుకున్నాయని ఆ సంస్థ తెలిపింది. అప్పటితో పోలిస్తే ఈ గణాంకాలు గణనీయంగా తగ్గాయి. అనుమతి లేని నౌకా మార్గాలను ఉపయోగించవద్దని ఇరాన్ హెచ్చరించినప్పటికీ, వారాంతంలో నౌకలు ఆ జలమార్గం గుండా పలు మార్గాల్లో ప్రయాణించడం కొనసాగించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్