mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘నో బిడ్–లో బిడ్’ దోపిడీకి చెక్ పెట్టాలి...

3 గంటల క్రితం

pogaku.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

పొగాకు రైతు చెమటతో కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. కానీ ఆ సంపదకు మూలమైన రైతుకు మాత్రం అప్పులు, నష్టాలు, అవమానాలే మిగులుతున్నాయి. ఇది మార్కెట్ వైఫల్యం కాదు. రైతు శ్రమను కార్పొరేట్ లాభాలకు బలిచేస్తున్న దోపిడీ వ్యవస్థ. "నో బిడ్–లో బిడ్" పేరుతో సాగుతున్న ఈ దోపిడీని అరికట్టకపోతే పొగాకు రైతాంగం మరింత సంక్షోభంలోకి నెట్టబడుతుంది. రైతుకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ కొనుగోళ్లు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలే శాశ్వత పరిష్కారం.

"ఒక కిలో పొగాకు రూ.160కు అమ్మితే కూలీలకు డబ్బు ఎలా ఇవ్వాలి? ఈ రోజు వేలానికి తెచ్చిన 15 బేళ్లను 'నో బిడ్' అంటూ వెనక్కి పంపితే అప్పులు ఎలా తీర్చాలి? సరాసరి ధర రూ.185 వస్తే కౌలు, బ్యార్నీ అద్దె, ఎరువుల బకాయిలు, కుటుంబ ఖర్చులు ఎలా మోయాలి?" అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు పాలకుల నుంచి సమాధానం లేదు. ఇవి కొందరు రైతుల ఆవేదన మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పొగాకు రైతుల గుండె చప్పుడు.

పెట్టుబడి అధికం ... ధర మాత్రం పతనం...

ఈ ఏడాది వర్జీనియా పొగాకు ఉత్పత్తికి కిలోకు రూ.220 నుంచి రూ.250 వరకు ఖర్చవుతోంది. ఎకరాకు దాదాపు రెండు లక్షల రూపాయల పెట్టుబడి అవసరమవుతోంది. కానీ వేలాల్లో కనీస ధర రూ.160, సరాసరి ధర రూ.185-200 మధ్యే తిరుగుతోంది. అంటే రైతుకు పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. కిలోకు కనీసం రూ.50 నష్టం, క్వింటాకు రూ.5 వేల నష్టం, ఎకరాకు రూ.40 వేల నుంచి అంతకంటే ఎక్కువ నష్టం, ఒక్కో బ్యార్నీకి రూ.3-4 లక్షల వరకు నష్టాలు వస్తున్నాయి. రైతు ఏడాది పొడవునా చేసిన శ్రమను వేలం మైదానంలో క్షణాల్లో చౌకగా కొట్టేస్తున్నారు.

'నో బిడ్' అంటే మార్కెట్ కాదు... రైతు మెడపై కత్తి....

వేలానికి తెచ్చిన పంటపై వ్యాపారులు బిడ్ వేయకుండా "నో బిడ్" ప్రకటించడం లేదా అత్యల్ప ధరలకు "లో బిడ్"లతో కొనుగోలు చేయడం స్వేచ్ఛా మార్కెట్ కాదు. ఇది గుత్తాధిపత్య వ్యాపారుల దోపిడీ వ్యూహం. రైతుకు నిల్వ సదుపాయం లేదు. అప్పులు తీర్చాలి. కూలీలకు చెల్లించాలి. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలను కృత్రిమంగా నియంత్రిస్తున్నారు. రైతును అమ్మక తప్పని పరిస్థితిలోకి నెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు.

ముఖ్యమంత్రి మాటలకు విలువ లేకపోతే ఎలా ?.....

"నో బిడ్–లో బిడ్ ఉండకూడదు. రూ.200కు పైగా అన్ని గ్రేడ్ల పొగాకును కొనుగోలు చేయాలి" అని ముఖ్యమంత్రి ప్రకటించినా వేలం కేంద్రాల్లో పరిస్థితి మారలేదు. వ్యాపారులు ప్రభుత్వాన్నే ధిక్కరిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వం మాటే అమలు కాకపోతే ఈ రాష్ట్రంలో పాలన ఎవరి చేతిలో ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. రైతు పక్షాన ప్రభుత్వం నిజంగా ఉంటే ప్రకటనలతో సరిపెట్టకుండా నేరుగా కొనుగోళ్లకు దిగాలి.

పొగాకు బోర్డు రైతు కోసం పనిచేయాలి.....

రైతు ప్రయోజనాల కోసం ఏర్పడిన పొగాకు బోర్డు రైతు అవమానించబడుతున్నా, ధరలు పడిపోతున్నా, కొనుగోళ్లు మందగిస్తున్నా మౌనంగా ఉండటం బాధాకరం. కోట్ల రూపాయల నిధులు, నియంత్రణ అధికారాలు ఉన్నా రైతుకు న్యాయం చేయలేకపోతే ఆ బోర్డు ఉనికికే అర్థం ఉండదు. రైతు ప్రయోజనాల కంటే కంపెనీల ప్రయోజనాలను కాపాడే సంస్థగా మారితే రైతు విశ్వాసాన్ని కోల్పోతుంది.

కార్పొరేట్ లాభాలు, రైతు అప్పులు... పెరుగుతున్నాయ్‌

ఐటిసి వంటి కంపెనీలు పొగాకు వ్యాపారం ద్వారా వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నాయి. షేర్ విలువలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలకు జీఎస్టీ, ఎక్సైజ్, ఇతర పన్నుల రూపంలో వేల కోట్ల ఆదాయం వస్తోంది. కానీ ఆ సంపదకు మూలమైన రైతుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒక సిగరెట్ తుది ధరలో రైతుకు వాటా లేదు . కంపెనీలకు లాభాలు, ప్రభుత్వాలకు భారీ పన్నుల ఆదాయం. ఇది రైతుపై జరుగుతున్న బహిరంగ అన్యాయం.

సి2+50 శాతం అమలే రైతు రక్షణ....

డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సూచించిన సి2+50 శాతం సూత్రాన్ని అమలు చేస్తేనే రైతుకు న్యాయం జరుగుతుంది. పూర్తి ఉత్పత్తి వ్యయంపై మరో 50 శాతం కలిపి ధర నిర్ణయించాలి. ప్రస్తుతం కిలోకు రూ.250 ఖర్చు వస్తే కనీస ధర రూ.375 ఉండాలి. ఇది రైతు విలాసం కోసం కాదు. బతకడానికి అవసరమైన కనీస హక్కు.

ప్రభుత్వం వెంటనే చేయాల్సిన చర్యలు...

- "నో బిడ్–లో బిడ్" విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. కిలోకు కనీసం రూ.300కు తక్కువ కాకుండా కొనుగోళ్లు జరగాలి. - స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు సి2+50 శాతం మద్దతు ధర ప్రకటించాలి. - రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించి... మార్క్‌ఫెడ్‌, సహకార సంస్థల ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభించాలి. - పొగాకు బోర్డును రైతు పక్షాన పనిచేసేలా కట్టడి చేయాలి. - కొనుగోళ్లు వేగవంతం చేసి "నో బిడ్" పేరుతో జరుగుతున్న పంట తిరస్కరణలు నిలిపివేయాలి. - పొగాకు ద్వారా ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో భాగాన్ని రైతు రక్షణ నిధిగా కేటాయించాలి.

రైతు బతికితేనే రంగం బతుకుతుంది

పొగాకు రైతు సమస్య ఒక పంటకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా రైతు మనుగడ కోసం సాగుతున్న పోరాటం. రైతు లేకుంటే కంపెనీలు లేవు. రైతు లేకుంటే ప్రభుత్వాలకు ఆదాయం లేదు. రైతు లేకుంటే ఎగుమతులు లేవు. అలాంటి రైతునే నష్టాల్లోకి నెట్టి కార్పొరేట్ లాభాలను కాపాడే వ్యవస్థను ఇక సహించలేం.

పొగాకు రైతు చెమటకు గౌరవం దక్కే వరకు, "నో బిడ్–లో బిడ్" దోపిడీ పూర్తిగా అంతమయ్యే వరకు, ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభమయ్యే వరకు, సి2+50 శాతం అమలు అయ్యే వరకు రైతు సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి. రైతుకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగకూడదు.

pentyala hanumantharao

-వ్యాసకర్త - పెంట్యాల హనుమంతరావు
రైతు సంఘం ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శి -


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్