ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తుండటం ప్రమాదకరం. ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ‘ది టెలిగ్రాఫ్’ మాజీ సంపాదకులు ఆర్ రాజగోపాల్ ఎస్‌ఐఆర్‌లో ఓటు హక్కు కోల్పోవడం, ఆ తరువాత ఆయన పాస్‌పోర్టు పునరుద్ధరణను నిలిపివేయడం కేంద్ర ప్రభుత్వ ప్రతీకార చర్యలకు పరాకాష్ట.
స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలను నిర్వహించడం ద్వారా నిష్పక్షపాత రాజ్యాంగ సంస్థగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) పూర్తిగా భ్రష్టు పట్టడం దురదృష్టకరం. ఏడాది కాలంలోనే దాదాపు ఆరు కోట్ల మంది ఓటు హక్కును హరించింది. మైనారిటీలు, దళితులు, వలస కూలీలు, నిరుపేదలు, మహిళల ఓట్లు తొలగింపునకు గురయ్యాయని తొలుత ఆందోళన వ్యక్తమైంది. తాజాగా రాజగోపాల్ ఉదంతంతో బిజెపి, సంఘ్ పరివార్ మతతత్వ భావజాలాన్ని వ్యతిరేకించే ప్రపంచ ప్రఖ్యాత సంపాదకులు సహా అందరికీ ఈ ముప్పు పొంచివుందని రూఢి అయింది. 30 ఏళ్లుగా కొల్‌కతాలో నివాసముంటూ... ‘ది టెలిగ్రాఫ్, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ ’ లాంటి పత్రికలకు ఆయన సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఆయన తల్లిదండ్రులు ప్రొఫెసర్లుగా సమాజంలో గుర్తింపు పొందారు. వారి పేర్లు 2002 జాబితాలో కనిపించలేదన్న కారణంగా... జన్మ ధృవపత్రం, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ సహా అన్ని ఆధారాలు సమర్పించినా... ఓటు తొలగించడం ఇసిఐ కక్షపూరిత వైఖరికి నిదర్శనం. ఓటు లేనందున పాస్ పోర్టును పునరుద్ధరించేది లేదని తేల్చిచెప్పారు. 1967 పాస్ పోర్టు చట్టం ప్రకారం ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడం పాస్ పోర్టు పునరుద్ధరణ దరఖాస్తు తిరస్కరణకు కారణం కాకూడదని స్వయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం అసమంజసం. రాజగోపాల్ ఓటు హక్కును, పాస్ పోర్టును పునరుద్ధరించి తప్పును సరి చేసుకోవడం ఇసిఐ, కేంద్ర ప్రభుత్వ బాధ్యత.
పౌరసత్వానికి పాస్ పోర్టు ప్రామాణికం కాదని విదేశాల్లో ప్రయాణించడానికి ఒక ప్రామాణిక పత్రమేనని ఇటీవల విదేశీ వ్యవహారాల శాఖ అధికారి ఒకరు ఇటీవల చేసిన ప్రకటన దేశ పౌరుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఏ పత్రం ప్రామాణికమో చెప్పాలన్న ప్రజల డిమాండ్‌కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులదే.
ఎస్‌ఐఆర్‌లో తొలగింపునకు గురైన ఓటర్లు సంక్షేమ పథకాలకు అనర్హులని ఇప్పటికే పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని బిజెపి ప్రభుత్వాలు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ సహా బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ కసరత్తు ముమ్మరం చేశాయి. బెంగాల్‌లో మహిళలకు ‘లక్ష్మీ భాండార్’ పేరుతో అమలవుతున్న పథకానికి ఓటు లేని మహిళల పేర్లను తొలగించే, రేషన్ కార్డులను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించేశారు. రేషన్ సహా ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు కాదని, వారి బ్యాంకు ఖాతాలను కూడా రద్దు చేస్తామని బీహార్ సి.ఎం ప్రకటించారు. బెంగాల్‌లో 91 లక్షల మంది, బీహార్‌లో 47 లక్షల మంది, మహారాష్ట్రలో 22 లక్షల మంది రేషన్ కార్డులు సహా సర్వ హక్కులూ కోల్పోయే ప్రమాదం పొంచి వుంది. కర్ణాటక సి.ఎం సైతం ఇదే విధమైన హెచ్చరిక చేశారు. సంపాదకులు రాజగోపాల్ అయినా... సామాన్యులైనా.. ఓటు హక్కు కోల్పోతే సర్వ హక్కులూ కోల్పోయి రెండో తరగతి పౌరులుగా జీవించాల్సిన దుస్థితిలోకి నెట్టేసే ఎస్‌ఐఆర్‌పై ప్రజలంతా అప్రమత్తం కావాలి. తనపై వస్తున్న విమర్శల నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓటర్ల హక్కులను పరిరక్షించడానికి బదులుగా, తన ఉల్లంఘనలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌ను కొనసాగిస్తున్న ఇసిఐ తీరును ఓటర్లంతా ఎండగట్టాలి. ఇ.సి పక్షపాత ధోరణిపై 23 ప్రతిపక్ష పార్టీలు సిజెఐకు తాజాగా లేఖ రాశాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొత్తంలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ, ఎస్‌ఐఆర్‌లో అర్హుల ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ప్రజలంతా పోరాడాలి. ప్రజాచైతన్యంతోనే భ్రష్టుపట్టిన ఇసిఐ ను ప్రక్షాళన చేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, రెండో తరగతి పౌరులుగా మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం చేస్తున్న యత్నాలను తిప్పికొట్టడం సాధ్యమవుతుంది.









కామెంట్‌లు (0)