- ఏడాదిలో 1.85 లక్షలు కట్
• కిస్తు కిస్తుకూ తగ్గుదల
- తాజాగా 30 వేలకు పైన కోత
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రంలో పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ఏడాదిలో విడతల వారీగా మొత్తం 1,85,245 మంది లబ్ధిదారులు తరిగిపోయారు. గత సంవత్సరం మూడవ కిస్తుకు, ఈ ఏడాది తొలి కిస్తుకు చూస్తే 30,414 మంది తగ్గారు. పిఎం కిసాన్‌కు కేంద్రం పెడుతున్న ఆంక్షల మూలంగా క్రమేపి పథకం లబ్దిదారుల సంఖ్య కుదించుకుపోతోంది. రైతులకు అందాల్సిన పిసరంత సాయం అందట్లేదు. పిఎం కిసాన్ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనైనా, కేంద్రం కోతలపై రాష్ట్ర ప్రభుత్వం మారు మాట్లాడట్లేదని విమర్శలొస్తున్నాయి. టిడిపి కూటమి ‘సూపర్ సిక్స్’ హామీ రైతులందరికీ ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం. కాగా సొంత భూమి కలిగిన రైతులకు పిఎం కిసాన్ రూ.6 వేలు పోను మిగిలిన రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పేరిట అందిస్తోంది. పిఎం కిసాన్ లబ్ధిదారులు తగ్గడం వల్ల రైతులకు ఇస్తామన్న రూ.20 వేల హామీ పలచనైంది. కేంద్రం వాటా రూ.6 వేలు పడవు. కేవలం రాష్ట్రం ఇచ్చే రూ.14 వేలు మాత్రమే జమ అవుతున్నాయి. లక్షల్లో రైతులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. జూన్ 20న 2026-27 ‘పిఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ’ తొలి కిస్తు 46,85,838 మందికి జమ చేస్తున్నామన్నారు. అంత మందికీ కేంద్రం రూ.2 వేలు జమ చేసేటట్లయితే రూ.937.16 కోట్లు పడాలి. కాని కేంద్రం వాటా రూ.782.55 కోట్లుగానే చూపించారు. ఆ ప్రకారం రైతులకు చేకూరుతుందన్న లబ్ధిలో రూ.155 కోట్లు తగ్గుదల కనిపిస్తోంది. లబ్ధిదారుల సంఖ్య తగ్గడం వల్లనే నిధులు తగ్గాయని తెలుస్తుంది.
రోజుకో షరతు
ముందుగానే అనర్హత ప్రకటించిన కేటగిరి వర్గాల రైతులే కాకుండా, ఇ-కెవైసి, ఆధార్ బేస్డ్ పేమెంట్ నిబంధనలకు తోడు 2019 ఫిబ్రవరి తర్వాత భూమిపై యాజమాన్య హక్కులు వచ్చిన రైతులు, ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు, అటువంటి వారిని భౌతికంగా పరిశీలించే వరకు లబ్ధిని నిలిపి వేసింది. ఇటువంటి ఆంక్షల వలన అంతకంతకూ పిఎం కిసాన్ లబ్ధిదారులు తగ్గిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాతా’ కు అర్హులుగా ఎంపిక చేసిన వారి కంటే పిఎం కిసాన్ లబ్ధిదారులు 7,93,082 తక్కువ. ఇదిలా ఉండగా పిఎం కిసాన్ పథకానికి భూమి విస్తీర్ణం పరిమితి లేదు. అన్నదాతాకు... పది సెంట్లు కనీసం ఉండాలన్న నిబంధనను కూటమి ప్రభుత్వం విధించింది. దాంతో గత వైసిపి ప్రభుత్వం చివరిలో ఇచ్చిన 'రైతు భరోసా’ లబ్ధిదారుల కంటే అన్నదాతా.. లబ్ధిదారులు ఐదారు లక్షల వరకు తగ్గారు. వీరికి కేవలం పిఎం కిసాన్ సాయమే అందుతుంది. అన్నదాతా.. లబ్ధి పడదు. ఒక పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల షరతుల వలన లక్షలాదిగా రైతులు ప్రభుత్వం ఇస్తామన్న నామమాత్రపు సాయం అందక నష్టపోతున్నారు. పిఎం కిసాన్ ప్రారంభం నుంచీ కేంద్రం కౌలు రైతులను సాయానికి మినహాయించింది. కౌలు రైతులకు తానే రూ.20 వేలిస్తామన్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు.
కోతలు ఇలా
2025-26 తొలి కిస్తు కోసం అర్హులుగా ఎంపిక చేసిన రైతుల కంటే ఆ ఏడాది రెండవ కిస్తుకు ఎంపికైన వారు 1,17,336 మంది తగ్గారు. రెండవ కిస్తు కంటే మూడవ కిస్తుకు 37,491 మంది తక్కువగా ఎంపికయ్యారు. నిరుడు మూడవ కిస్తు కంటే ఈ ఏడాది తొలి కిస్తుకు 10,431 మంది తగ్గారు. పేమెంట్ విషయానికొస్తే గతేడాది తొలి కిస్తు కంటే రెండవ కిస్తుకు 1,61,641 మంది తగ్గారు. రెండవ కిస్తు కంటే మూడవ కిస్తుకు 7,432 మంది పెరిగారు. గతేడాది మూడవ కిస్తు కంటే ఈ సంవత్సరం తొలి కిస్తుకు లబ్ధిదారులు 30.414 మంది తగ్గారు.









కామెంట్‌లు (0)