భారత దేశ పౌరుడు అని చెప్పడానికి రాజ్యాంగంలో నిర్ధిష్ట పత్రాలు ఏవీ సూచించకపోయినా.. పాస్ పోర్టు కలిగివుండటం ఒక ప్రామాణికంగా ఇన్నాళ్లూ భావించాం. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త భాష్యాలు చెబుతుండటం ప్రజానీకాన్ని భయాందోళనల్లోకి నెట్టేస్తోంది. భారత పాస్‌పోర్ట్ ఒక “ప్రయాణ పత్రం” (ట్రావెల్ డాక్యుమెంట్) మాత్రమేనని, పౌరసత్వ పత్రం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ఉన్నతాధికారి ఒకరు ఈ నెల 24న ప్రకటించారు. విదేశీ ఓడరేవులు, భూభాగాల గుండా ప్రయాణించడానికి, రాకపోకలు సాగించడానికి భారతీయులకు సహాయపడటమే భారత పాస్‌పోర్ట్ ఉద్దేశ్యమని, పౌరసత్వ హక్కులను నిర్ధారించడానికి ఉపయోగించే ఇతర పత్రాలతో దీనిని పోల్చకూడదని ఆ అధికారి అన్నారు. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ద్వారా అనేక మంది పేదలు, అణగారిన ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారు. ద టెలిగ్రాఫ్ మాజీ సంపాదకులు ఆర్ రాజగోపాల్ వంటి వారి పేర్లు సైతం ఓటర్ల జాబితాలో మాయమవుతున్నాయి. తన పాస్ పోర్టు పునరుద్ధరణకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇటీవల తెలియజేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ తీరుపై ఆయన తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ఓటర్ల జాబితా నుండి పేరు తొలగిస్తే..తిరిగి పేరు చేర్చడానికి భారత పాస్‌పోర్టు పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుందా? అనే ప్రశ్నకు, ఒక సీనియర్ ఎంఇఎ అధికారి ఇలా సమాధానమిచ్చారు. ‘పాస్‌పోర్ట్ అనేది ఒక ప్రయాణ పత్రం. పౌరసత్వ పత్రం కాదు. సిద్ధాంతపరంగా చెప్పాలంటే ఈ అంశమే పాస్‌పోర్ట్‌ను ఇతర పత్రాల నుండి వేరు చేస్తుంది. విదేశాలకు ప్రయాణించేటప్పుడు పాస్‌పోర్ట్ మీ జాతీయతను ధృవీకరించినప్పటికీ..అది దేశంలో మీ పౌరసత్వ పత్రం కాబోదు’ అని సదరు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో భారత పౌరసత్వ నిరూపణకు సరిపోయే ప్రామాణిక పత్రం ఏదన్న సమాధానం లేని ప్రశ్న దేశ ప్రజానీకాన్ని వెంటాడుతోంది.
కేంద్ర హోంశాఖ పాస్‌పోర్టు పౌరసత్వ ప్రతం కాదని ప్రకటించడానికి కారణమేంటి?
పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం, పాస్‌పోర్ట్ అథారిటీ, అవసరమని భావించిన మేరకు ఏవైనా విచారణలు జరిపిన తర్వాత ఒక పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాన్ని జారీ చేస్తుంది. పాస్‌పోర్ట్‌లు కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం మాత్రమే అవసరమవుతాయి. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రం లేకుండా ఏ వ్యక్తి కూడా భారతదేశం నుండి విదేశాలకు వెళ్లడానికి వీళ్లేదు. ప్రభుత్వ పాస్‌పోర్ట్ మాన్యువల్ ప్రకారం..పాస్‌పోర్ట్ అనేది దానిని కలిగి ఉన్నవారి జాతీయతకు రుజువు. కానీ దీనిని ఒక వ్యక్తి యొక్క పౌరసత్వ హోదాకు సంబంధించిన ఇతర రుజువులతో సమానంగానే పరిగణిస్తారు. మరో మాటలో చెప్పాలంటే.. పాస్‌పోర్ట్ అనేది దానిని కలిగి ఉన్నవారు భారత పౌరులు అనడానికి ఒక బలమైన రుజువు. అయితే, చట్టపరంగా, దీనిని పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన రుజువుగా పరిగణించరు. ఒక వ్యక్తి పౌరసత్వం వివాదాస్పదమైతే, న్యాయస్థానాలు దానిని ఇతర సంబంధిత రుజువులతో పాటు పరిశీలించవచ్చు.
మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1978) ప్రకారం..పాస్‌పోర్టు అనేది అది కలిగియున్న వ్యక్తి భారతదేశ జాతీయుడు అని చెప్పడానికి ఒక ధ్రువీకరణ పత్రంగా జారీ చేస్తారు. భారత పాస్‌పోర్టు కలిగియున్న వ్యక్తులు భారతదేశ జాతీయులుగా ఇటు భారతదేశంలోనూ, విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి భారత దౌత్య కార్యాలయాల్లో సహాయం పొందేందుకు ఈ పాస్‌పోర్టుల ద్వారానే అర్హత లభిస్తుంది.
సెక్షన్ 6(2)(ఎ) ప్రకారం..ఒక వేళ దరఖాస్తుదారు భారతదేశ పౌరుడు కాకపోతే అధికృత సంస్థ పాస్‌పోర్ట్ జారీ చేయకుండా నిరాకరించవచ్చు. అయితే ఇదే చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం..ఒక వ్యక్తి భారతదేశ పౌరుడు కాకపోయినా కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తే..సదరు వ్యక్తికి భారత పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాన్ని జారీ చేయవచ్చు లేదా జారీ చేయించవచ్చు.
2023లో హరినా వర్సెస్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ కేసులో.. శ్రీలంక శరణార్థి (చట్టపరంగా ఏ దేశానికి చెందని వ్యక్తి - స్టేట్ లెస్ పర్సన్) కుమార్తె ఒకరు ఇదే చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం భారత పాస్‌పోర్ట్ జారీకి తన దరఖాస్తును పరిశీలించాలని విన్నవించగా..మద్రాసు హైకోర్టు అందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవాలని, పాస్‌పోర్ట్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ప్రామాణిక రుజువు ఎందుకు కాదు?
పౌరసత్వ సాక్షాధారానికి, పౌరసత్వ నిశ్చయాత్మక రుజువుకు మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇలా పేర్కొంది. పౌరసత్వం అనేది పౌరసత్వ చట్టం ఆధారంగా నిర్ధారిస్తామని, కానీ పాస్‌పోర్టులను పాస్‌పోర్ట్ చట్టం కింద జారీ చేస్తామని పేర్కొంది. అయితే వివాదం తలెత్తిన సందర్భంలో పాస్‌పోర్ట్ పత్రం తనకు తానుగా పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన లేదా నిర్ణయాత్మకమైన రుజువు కాబోదు అని తెలిపింది.
ఓటర్ల జాబితాలో పేరు ఉండటం పౌరసత్వానికి రుజువు అవుతుందా?
గతేడాది బీహార్‌లోనూ ఆ తర్వాత ఇతర రాష్ర్టాల్లోనూ ఎస్‌ఐఆర్ ప్రకియ సమయంలో భారత పౌరసత్వ రుజువు పత్రాలుగా కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 'సూచనాత్మక' పత్రాలలో పాస్‌పోర్ట్ కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మ్యాపింగ్ తదితర కారణాల వల్ల ఎస్‌ఐఆర్ ముసాయిదాలో పేర్లు తొలగించినవాళ్లను పాస్‌పోర్ట్ పత్రాల ఆధారంగానే ధ్రువీకరించి తిరిగి జాబితాలో చేర్చారు.
2025 ఆగస్టు 12న లోక్‌సభలోఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. భారతదేశంలో పౌరసత్వ నిరూపణకు ప్రజలకు అవసరమైన ‘చెల్లుబాటు అయ్యే పత్రాల వర్గీకరణలు’ ఏవీ లేవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. భారత పౌరసత్వం అనేది పౌరసత్వ చట్టం-1955లోని నిబంధనలు, వాటి ఆధారంగా రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది మే 27న ఎస్‌ఐఆర్ ప్రక్రియ రాజ్యాంగ బద్ధతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది. ఇదే తీర్పులో పౌరసత్వానికి ఆధార్ కార్డు రుజువు కాదు అని, అందువల్ల ఆ ప్రయోజనం కోసం ఆధార్‌పై ఆధారపడలేమని పేర్కొంది. అయితే, ఒక వ్యక్తి యొక్క గుర్తింపును నిర్ధారించే పరిమిత ప్రయోజనం కోసం సమర్పించదగిన పత్రాలలో ఆధార్ కూడా ఒకటి అని తెలిపింది.
లాల్ బాబు హుస్సేన్ వర్సెస్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (1995) నాటి కేసులో.. ఓటర్ల జాబితాలో పేరు ఉంటే వారికి పౌరసత్వపు హక్కు ఉంటుందనే భావించాల్సివుంటుందని, అందువల్ల చట్టం నిర్దేశించిన ప్రక్రియను మినహాయిస్తే ఆ భావనను తోసిపుచ్చజాలమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
అయితే ఎన్నికల సంఘం యొక్క పాత్ర.. ఓటర్ల జాబితాలో నమోదుకు అర్హతను నిర్ధారించడానికి మాత్రమే పరిమితమని న్యాయస్థానం నొక్కి చెప్పింది. అంతేకాని పౌరసత్వాన్ని ఎన్నికల సంఘం నిర్ధారించజాలదని తేల్చిచెప్పింది. అలాగే పౌరసత్వ చట్టం కింద పౌరసత్వం కలిగియున్న ఒక వ్యక్తి.. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రకారం.. ఓటర్ల జాబితాలో నమోదుకు అనర్హుడు కాదన్న కారణంతో సదరు వ్యక్తి పౌరసత్వం రద్దు కాబోదు అని కూడా స్పష్టం చేసింది.
ఏకైక పౌరసత్వ రుజువు ఏదైనా ఉందా?
పౌరసత్వాన్ని నిర్ధారించే ఒక సార్వత్రిక పౌరసత్వ పత్రమేదీ భారత్‌లో లేదు. పౌరసత్వ చట్టం-1955 ప్రకారం..1) పుట్టుక ద్వారా, 2) వంశపారంపర్యంగా, 3) రిజిస్ర్టేషన్ ద్వారా, 4) సహజీకరణ ద్వారా, అలాగే 5) భూభాగ విలీనం ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు.
వివాదాన్ని అనుసరించి వివిధ రకాల సాక్ష్యాలను ఆధారంగా చేసుకోవచ్చు. సాధారణంగా..రిజిస్ర్టేషన్ ద్వారానూ, సహజీకరణ (న్యూట్రలైజేషన్) ద్వారానూ పౌరసత్వం పొందినవారికి మాత్రమే పౌరసత్వ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు. భారతదేశంలో పుట్టక, వంశపారంపర్యంగా పౌరసత్వం పొందినవారిలో అత్యధికమంది పౌరసత్వ ధ్రువీకరణపత్రాలు కలిగివుండరు. ఇలాంటి వారి విషయంలో పుట్టినతేదీ, పుట్టిన స్థలం, జాతీయత, తల్లిదండ్రుల వివరాలు తదితర అనేక పత్రాల ద్వారానే పౌరసత్వం రుజువు చేస్తారు.
భారత పౌరసత్వం పొందడం ఎలా?
పౌరసత్వ చట్టం 1955 ప్రకారం.. భారత పౌరసత్వాన్ని పొందేందుకు నాలుగు ప్రాథమిక మార్గాలున్నాఇయ. అవి పుట్టుక, వంశపారంపర్యం, రిజిస్ట్రేషన్, సహజీకరణ.
• పుట్టుకతో: పౌరసత్వ చట్టం 1955 కాలక్రమేణా అనేక సవరణలను పొందింది. ఈ చట్టం ప్రకారం..జనవరి 26, 1950 - జులై 1, 1987 మధ్య భారతదేశంలో జన్మించిన ఎవరైనా, వారి తల్లిదండ్రుల జాతీయతతో సంబంధం లేకుండా, పుట్టుకతోనే భారత పౌరులు అవుతారు. జూలై 1, 1987 మరియు డిసెంబర్ 3, 2004 మధ్య జన్మించిన వారికి, తల్లిదండ్రులలో కనీసం ఒకరు అయినా భారత పౌరులు అయ్యి ఉండాలి. అయితే డిసెంబర్ 3, 2004న లేదా ఆ తర్వాత జన్మించిన వారికి, తల్లిదండ్రులలో ఒకరు భారత పౌరులు అయివుండాలి. అదే సమయంలో ఇంకొకరు కచ్చితంగా అక్రమ వలసదారు అయ్యి ఉండరాదు. • వంశపారంపర్యంగా: తల్లిదండ్రులలో ఒకరు లేదా ఇద్దరూ భారత పౌరులైతే, భారతదేశం వెలుపల జన్మించిన వ్యక్తి కూడా ఈ చట్టం ప్రకారం నిర్దేశించిన షరతులు, కాలపరిమితులకు లోబడి పౌరసత్వం పొందవచ్చు. డిసెంబర్ 3, 2004 తర్వాత విదేశాలలో జన్మించిన వారు కూడా నిర్దేశిత కాలపరిమితిలోగా భారత కాన్సులేట్‌లో తమ జననాన్ని నమోదు చేయించుకోవాలి.
• రిజిస్ట్రేషన్ ద్వారా: భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు, భారత పౌరుల జీవిత భాగస్వాములు మరియు భారత పౌరుల మైనర్ పిల్లలతో సహా కొన్ని తరగతుల వ్యక్తులు, చట్టంలో నిర్దేశించిన నివాస మరియు ఇతర షరతులను నెరవేర్చిన తర్వాత నమోదు ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
• సహజీకరణ ద్వారా: ఒక విదేశీయుడు, సాధారణంగా 12 సంవత్సరాల నివాసం భారత్‌లో ఉంటే, ఈ చట్టంలోని మూడవ షెడ్యూల్‌లో సూచించిన అర్హతలను సంతృప్తిపరిచిన తర్వాత, సహజీకరణ ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.
పౌరసత్వ చట్టం.. ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. దీనిని అనేకసార్లు సవరించారు, ముఖ్యంగా 1986 మరియు 2003లో కీలక సవరణలు చేశారు.
తల్లిదండ్రుల పౌరసత్వ అవసరాలను పేర్కొంటూ వారికి పుట్టిన పిల్లలకు పౌరసత్వం విషయంలో సానుకూల సవరణలు చేయగా...అలాగే అక్రమ వలసదారులైనటువంటి తల్లిదండ్రలున్న పిల్లలకు విషయంలో స్వయంచాలక పౌరసత్వ వర్తింపును తొలగించారు.
కాలక్రమేణా పౌరసత్వ చట్టం ఎలా మారింది?
పౌరసత్వ చట్టానికి అనేకసార్లు సవరణలు జరిగాయి. ప్రధానంగా 1986, 2003, 2005, 2015 మరియు 2019 సంవత్సరాలలో చేసిన సవరణలు ముఖ్యమైనవి.
• 1986లో తొలిసారి భారీ మార్పు చేశారు. పుట్టిన ప్రదేశం ఆధారంగా పౌరసత్వం నిర్ధారించే ‘జస్ సోలి’ సూత్రాన్ని దూరంగా పెట్టారు. 1950 జనవరి 26 6 1987 జులై 1 మధ్య భారతదేశంలో జన్మించిన ఎవరైనా స్వయంచాలకంగా పౌరులు అవుతారు. అయితే 1987 జులై 1 తర్వాత జన్మించిన వారు, వారి తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత పౌరుడైతేనే పుట్టుకతో పౌరసత్వం లభిస్తుంది.
• 2003 సవరణ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. 2004 డిసెంబర్ 3న లేదా ఆ తర్వాత జన్మించిన వారికి, తల్లిదండ్రులిద్దరూ భారత పౌరులైతే లేదా తల్లిదండ్రులలో ఒకరు భారత పౌరుడై, మరొకరు అక్రమ వలసదారుడు కాకపోతే మాత్రమే పుట్టుకతో పౌరసత్వం లభిస్తుంది. ఈ సవరణ అక్రమ వలసదారులు రిజిస్ట్రేషన్ లేదా సహజీకరణ ద్వారా పౌరసత్వం పొందకుండా కూడా నిరోధించింది.
• 2019లో తీసుకొచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తొలిసారి ‘మతం’ రంగు పులిమి పౌరసత్వానికి ఒక ప్రత్యేక మార్గాన్ని రూపొందించారు. భారతదేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవులు 2014 డిసెంబరు 31కి ముందు భారత్‌కు వచ్చివుంటే వారికి సహజీకరణ పౌరసత్వ కోసం నిర్దేశించిన నివాస కాలాన్ని బాగా తగ్గించారు. ఈ సవరణ కేవలం ఇస్లామిక్ దేశాలకే అందునా కొన్ని మతాల ప్రజలకే వర్తింపజేయడం వివాదస్పదమైంది.
(ది హిందూ సౌజన్యంతో)
ఫీచర్స్ అండ్ పాలిటిక్స్









కామెంట్‌లు (0)