మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశవ్యాప్తంగా ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ ఉద్యమం

3 గంటల క్రితం

‘School Theek Karo’ movement across the country
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 09:58 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సిజెపి పిలుపుతో అన్ని రాష్ట్రాల్లో విద్యార్థుల ర్యాలీలు

బిజెపి పాలిత రాష్ట్రాల్లో దయనీయంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి

ఫొటోలు, వీడియోలు తీయకుండా రాజస్థాన్‌ ప్రభుత్వం ఆంక్షలు

బెంగాల్‌లో సిజెపి వాలంటీర్‌పై బిజెపి నేతల దాడి

బాధితుడి తండ్రి మృతి


న్యూఢిల్లీ : తరగతి గదుల నుంచి విద్యార్థులు బయటకు వస్తున్నారు. పాఠశాలల గేట్ల వద్ద నిలబడి నినాదాలు చేస్తున్నారు. బీహార్‌ నుంచి తమిళనాడు వరకు, రాజస్థాన్‌ నుంచి పశ్చిమబెంగాల్‌ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాలు మారుతున్న కొద్దీ భాష మారుతున్నా.. వారి డిమాండ్లు మాత్రం ఒక్కటే. ‘హమారా స్కూల్‌ ఠీక్‌ కరో’ అంటూ విద్యార్థులు నినదిస్తున్నారు. పాడుబడిన పాఠశాల భవనాలు, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, సరిపోని బెంచీలు, సురక్షితం కాని తాగునీరు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపర్చాలనే డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ జాతీయ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే ఆగస్టు 15 నుంచి ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ఈ ఉద్యమం మరింత విస్తరిస్తోంది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా సిజెపి గతంలో నిర్వహించిన ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆ ఉద్యమం అనంతరం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. దీంతో సిజెపి చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది.


రైతులు, కార్మికుల పిల్లలు దేశ భవిష్యత్తు కాదని ప్రధానమంత్రి భావిస్తున్నారా ? : అభిజీత్‌ దీప్కే

ఆగస్టు 11న అభిజీత్‌ దీప్కే ‘హమారా స్కూల్‌ ఠీక్‌ కరో’ ఉద్యమాన్ని ప్రకటించారు. ఆగస్టు 15న తన సొంత గ్రామమైన సంతుక్‌ పింప్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో నెలకొన్న మౌలిక సమస్యలను ఆయన మీడియా ముందు ప్రస్తావించారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్‌ భవనం, ప్రధానమంత్రి నివాసం నిర్మిస్తున్నప్పుడు విద్యార్థుల కోసం పాఠశాల భవనాలను ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. రైతులు, కార్మికుల పిల్లలు దేశ భవిష్యత్తు కాదని ప్రధానమంత్రి భావిస్తున్నారా అని అభిజీత్‌ దీప్కే ప్రశ్నించారు.


దేశవ్యాప్తంగా ఆందోళనలు ....

సిజెపి ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమాన్ని ప్రారంభించకముందే పలు రాష్ట్రాల్లో విద్యార్థులు పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ఆందోళనలు చేపట్టారు. జూలై 27న ఫతేపూర్‌లోని సర్వోదయ ఇంటర్‌ కాలేజీ విద్యార్థులు పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరతపై నిరసన తెలిపారు. దీంతో పాఠశాల యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది.


ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లా చందుపూర్‌ గ్రామానికి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. పాఠశాలకు పక్కా రహదారి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. లక్నోలోని జై ప్రకాశ్‌ నారాయణ్‌ సర్వోదయ విద్యార్థులు ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ బుద్ధేశ్వర్‌ కూడలిలో ఆందోళనకు దిగారు.


బీహార్‌లోని గయా జిల్లాలో సిమువారా పాఠశాల విద్యార్థులు మౌలిక వసతుల కోసం రోడ్డెక్కారు. పాఠశాలలో ఫ్యాన్లు పనిచేయడం లేదని, హ్యాండ్‌పంపులు పాడైపోయాయని, బెంచీలు లేవని 50 మంది విద్యార్థులు ఎస్‌డీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దీంతో అధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది బాలికలు రోడ్డెక్కారు. చండీగఢ్‌లో మూగ, బధిర విద్యార్థులు కూడా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లోని జై ప్రకాశ్‌ నారాయణ్‌ సర్వోదయ విద్యాలయానికి చెందిన సుమారు 200 మంది బాలికలు ఉపాధ్యాయుల కొరత, నాణ్యత లేని ఆహారాన్ని నిరసిస్తూ లక్నో-దుబ్బాగ బైపాస్‌పై బైఠాయించారు. సుమారు రెండు గంటల పాటు వర్షంలో తడుస్తూనే ఆందోళన కొనసాగించారు.


తమిళనాడులోని కొడవలి గ్రామంలో మద్యం దుకాణాన్ని తరలించాలని గ్రామస్తులతో కలిసి విద్యార్థులు నిరసన చేపట్టారు. కర్నాటకలోని బిదాడిలో రైతులు భూముల పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమానికి విద్యార్థులు మద్దతు తెలిపారు. 9,600 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీ, డేటా సెంటర్ల ఏర్పాటుతో సుమారు 10 లక్షల చెట్లను నరికివేయాల్సి వస్తుందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.


ఆగస్టు 14న సిజెపి సహ కన్వీనర్‌ అశుతోష్‌ రంకా నేతృత్వంలో సుమారు 50 మంది కార్యకర్తలు, జోధావాస్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ పాఠశాల విద్యార్థులు, స్థానికులు కలిసి నిరసన తెలిపారు. కొన్ని రోజుల కిందట ఈ పాఠశాల పైకప్పు కూలిపోయిందని అశుతోష్‌ తెలిపారు. ఆరుగురు సీనియర్‌ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాజస్థాన్‌లో సుమారు 84 వేల తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయని, 15 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.


బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రతిఘటనలు .. సిజెపి వాలంటీర్ పై బిజెపి వ్యక్తుల దాడి

రాజస్థాన్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తామని సిజెపి ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బయటి వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశించకూడదని, అక్కడ ఫొటోలు, వీడియోలు తీయకూడదని ఆదేశించింది. ఇదిలా ఉండగా .... ఆగస్టు 16న పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో సిజెపి వాలంటీర్ ‌పై కొందరు బిజెపి వ్యక్తులు దాడి చేశారని ఆ పార్టీ ప్రతినిధి అశుతోష్‌ రంకా ఆరోపించారు. ఇండస్‌ బ్లాక్‌లోని ఓ పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం వాలంటీర్‌ అబ్దుల్‌ హఫీజ్‌ ఇంటికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారని తెలిపారు. ఈ ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన హఫీజ్‌ తండ్రి జనాబ్‌ మఫిక్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు అశుతోష్‌ రంకా పేర్కొన్నారు. అబ్దుల్‌ హఫీజ్‌కు న్యాయం జరిగే వరకు అక్కడే ఉండి పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్