- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
- సిఇసి జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలి
- బిజెపి తీరు దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం
- టిడిపి సమర్థించడం సరికాదు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రధాని మోడీ, హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షా రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రిస్తున్నారని, సిఇసి జ్ఞానేష్‌కుమార్ వారి కనుసన్నల్లో పనిచేసి 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని, ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి ప్రమాదమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిఇసిని తొలగించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని, ఓటర్ల జాబితా నుండి అన్యాయంగా తొలగించిన వారి ఓట్లను పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషనర్ల నియామక వ్యవస్థలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సభ్యుడిగా చేర్చాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబివికెలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టులు చేసిన కృషి వల్ల ఎన్నికల కమిషన్లో జరుగుతున్న అక్రమాలు బయటకొచ్చాయన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలిసిన తరువాత బిజెపి నాయకత్వం తప్పేమీ జరగలేదన్నట్లు ప్రకటనలు చేసిందని, ఎన్నికల కమిషన్ నోరెత్తడం లేదని తెలిపారు. ఇటీవల కాలంలో జరిగిన రాష్ట్రాల ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఓటర్ల లిస్టులో అక్షర దోషాలకు అసలు కారకులు అధికారులేనని, వారిని జైల్లో పెట్టాలన్నారు. ఎన్నికల కమిషనర్ ఎన్నిక ప్రక్రియలోకి సిజెఐని తీసుకుని కొత్త కమిటీని వారి అధ్యక్షతన ఏర్పాటు చేయాలని, దేశ వ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల ఓట్లను చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్ చేసిన ప్రకటనను ఆహ్వానిస్తున్నామని, ఇసిని సమర్థిస్తూ టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ట్వీట్‌ను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు జెడి శీలం మాట్లాడుతూ.. జ్క్షానేష్‌కుమార్ నియామకం మొత్తం అక్రమ మార్గాల్లో సాగిందని తెలిపారు. మోడీ, అమిత్‌షా చెప్పినట్లు వినేందుకు వీలుగా చట్టంలో సవరణలు చేసి అతన్ని నియమించారని, రామమందిరంలో అవినీతికి పాల్పడిన కమిటీని కూడా ఇతనే నియమించారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని కోరారు. వెంటనే జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలని, దీనికోసం జరిగే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వస్తుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. సిఇసిని తక్షణమే తొలగించాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియను గుప్పెట్లో పెట్టుకుని వారికి కావాల్సిన అధికారాన్ని నిలబెట్టకునేందుకు వీలుగా మోడీ, అమిత్‌షా కీలుబొమ్మ సిఇసిని తెచ్చి పెట్టి ఏకపక్షంగా చేసుకుపోయారని, ఇదే పద్ధతి అనుసరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం బతకదని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి విచారించాలని కోరారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ.. దేశంలో జరిగిన ఎన్నికల తీరుపై అనేక అనుమానాలొస్తున్నాయని, ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. వ్యవస్థల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వైసిపి నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌లో జరిగిన ఓట్ల తొలగింపు ప్రకియపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి ఓటు హక్కు లేకుండా చేసి ఎన్నికలకు వెళ్లడం సరికాదని తెలిపారు. దీనికోసం జరిగే ఆందోళనల్లో వైసిపి కలిసి వస్తుందన్నారు. ఓటు పరిరక్షణ వేదిక కన్వీనర్ సుంకర రాజేంద్రప్రసాదు మాట్లాడుతూ.. కేంద్రం రాజ్యాంగ వ్యవస్థలను ముఖ్యంగా ఎన్నికలు, న్యాయ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుంటోందని విమర్శించారు. జ్ఞానేష్‌కుమార్‌పై అనేక విమర్శలు ఉన్నాయని, నోయిడాలో కార్మికులను బలవంతంగా అరెస్టు చేయించింది కలెక్టర్‌గా ఉన్న జ్ఞానేష్‌కుమార్ కుమార్తె అని తెలిపారు. అన్ని వ్యవస్థల్లో బిజెపి ఎజెండాను అమలు చేస్తే అవన్నీ దెబ్బతింటాయని, ప్రజలకు న్యాయం దక్కదని, కీలకమైన ఎన్నికల ప్రక్రియ నిరుపయోగంగా మారుతుందని అన్నారు. మాజీ ఐఎఎస్ అధికారి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్లో మెజార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన అంశాలపై అన్ని పక్షాలూ కలిసి నిలదీయ బట్టే అసలు విషయం బయటకొచ్చిందని, దాన్ని చట్టపరంగానూ నిరూపించి అతనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రికార్డులన్నీ భద్రపరచాలని, ముఖ్యంగా సిఇసిలు అభ్యంతరం వ్యక్తం చేసిన 14 అంశాలకు సంబంధించిన ఫైల్స్‌కు రక్షణ కల్పించాలని, సుప్రీంకోర్టు దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ మాట్లాడుతూ.. ఇప్పుడు దేశంలో ఉన్న నియంత పాలకులు వ్యవస్థలను, మీడియాను నియంత్రిస్తున్నారని విమర్శించారు. జనచైతన్య వేదిక నాయకులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసేందుకే బిజెపి పనిచేస్తోందని విమర్శించారు. విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ.. అస్సాంలో అక్రమ చొరబాటుదారులని తేల్చినవారిలో ఒక్కరిపైనా చర్య తీసుకోలేదని, ఇటువంటి చర్యలన్నీ ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదని తెలిపారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్ మాట్లాడుతూ.. కళ్లముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోతే భవిష్యత్ తరాలకు న్యాయం జరగదని అన్నారు. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పి.పొలారి, ఎం.రామకృష్ణ మాట్లాడుతూ.. సిఇసి విషయంలో లోతుగా పరిశీలిస్తే ప్రజాస్వామ్యంపై ఏకపక్షదాడి జరిగిందనేది స్పష్టమవుతుందని పేర్కొన్నారు. సామాజికవేత్త కుర్రా వసుంధర మాట్లాడుతూ.. సిఇసిని పునర్నిర్మించాలని అన్నారు. ఎంసిపిఐ నాయకులు ఖాదర్ బాషా, ఎస్‌యుసిఐసి నాయకులు సుధీర్ మాట్లాడుతూ.. శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ఎన్నికల వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు మోడీ, అమిత్‌షా చేస్తున్న కుట్రలపై దేశవ్యాప్త ఆందోళన జరపాలని కోరారు. 28వ తేదీన యూత్ ఫర్ డెమోక్రసీ కార్యక్రమంలో యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొనాలని కోరారు. అక్టోబరు 2వ తేదీన జరిగే నిరసనలు, ఆందోళనల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వక్తలు కోరారు.







కామెంట్‌లు (0)