- జీపుజాతాలో సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి - శ్రీసత్యసాయి జిల్లా యంత్రాంగం : జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా గుర్తిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సి.రామకృష్ణ డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన కరువు పరిశీలన జీపు జాతా ఆదివారం జిల్లాలోని పుట్టపర్తి, కొత్తచెరువు, ఓబుళ దేవర చెరువు, నల్లమాడ, పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో కొనసాగింది. జీపుజాతా సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించిన నాయకులు రైతుల, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన పంటలు తీవ్ర కరువు నేపథ్యంలో కేవలం 2.70 లక్షల ఎకరాల్లో మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. సాగయిన పంటలు కూడా ఎండిపోయాయన్నారు. పంట సాగుచేసిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పశుగ్రాసం సరఫరా చేయాలని, ఉపాధి హామీ కార్మికులకు 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు రూ.700 లు ఇవ్వాలని కోరారు. హంద్రీనీవా కాలువ ద్వారా నియోజకవర్గంలోని 193 చెరువులను నింపుతామని ఇచ్చిన హామీ ఏమైందని పాలకులను ప్రశ్నించారు. పుట్టపర్తి మున్సిపాలిటీకి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారే తప్ప ఇచ్చింది లేదన్నారు. ఇప్పుడు తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొకసారి ప్రజలను మోసం చేయడానికి పాలకులు చూస్తున్నారని విమర్శించారు. పరిశ్రమలకు పేరుతో రైతుల భూములను లాక్కోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. కరువు సమస్యలపై ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ జీపుజాతాలో ఎపి రైతుసంఘం జిల్లా నాయకులు హరి, జంగాపల్లి పెద్దన్న, సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్‌పి శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)