ఒంగోలు రూరల్ : వెలిగొండ బంగారు కొండ అవుతుందని, కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర ఇది అని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను చంద్రబాబు ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను. పునాది వేశాను.. ప్రాజక్టును పూర్తి చేశానని సగర్వంగా చెబుతున్నానన్నారు. 30 ఏళ్ల క్రితం 1996లో ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత మొదటి దశ ప్రారంభించి జాతికి అంకితం చేశానన్నారు. నాడు చేసిన సంకల్పం.. నేడు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారిందన్నారు. ఇది భగీరథ ప్రయత్నం.. కొండలు వస్తే తొలిచి ముందుకెళ్లాం అని చెప్పారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. నిర్వాసితులు కూడా సంతోషంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. ఆర్థికంగా కష్టాలున్నా.. ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. వాన కోసం ఆకాశం వైపు చూసిన రైతుల బాధలు చూశామన్నారు. బోరు వేస్తే నీళ్లు పడకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలను చూశామని, పనులు దొరక్క ఊరు విడిచి వెళ్లిన కూలీలను చూశామని.. ఇక ఆ పరిస్థితులు ఉండవు అని చెప్పారు. ఫ్లోరైడ్ అనే పదం మరచిపోతామన్నారు. 2019లో గొడ్డలి పార్టీ రాకతో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టిందని, 2024లో ఆ గ్రహణం వీడిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో కేవలం 2.77 శాతమే పనులు చేశారని, నిర్వాసితుల కోసం జీవో ఇచ్చి చెల్లింపులతో మోసం చేశారని విమర్శించారు. ప్రధాని మోడి సహాయం.. మిత్రుడు పవన్ సహకారంతో ముందుకెళుతున్నామన్నారు. కరవుతో పోరాడిన రైతన్నకు కృష్ణా జలాలతో స్వాగతం పలికామన్నారు. వెలిగొండ అంటే ఫ్లోరైడ్ కష్టానికి ముగింపు అని చెప్పారు. వెలిగొండ బంగారు కొండ అవుతుందన్నారు. కరవుపై గెలవాలన్న సంకల్పంతో ముందడుగు వేశామన్నారు. కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర ఇది అని అభివర్ణించారు. 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడి, పవన్ కల్యాణ్, తానూ కలిసి రాష్ట్ర పునర్నిర్మాణంపై మాట ఇచ్చామన్నారు. తమపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యమిచ్చారని, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి అన్నీ ప్రయోజనాలేనని సిఎం చంద్రబాబు ప్రసంగించారు.
కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర : సిఎం చంద్రబాబు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 02:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)