న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ... భారత ప్రధాని మోడి సోమవారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్ లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సమావేశంలో ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమావేశాల్లో ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తోనూ ప్రధాని మోడి భేటీ అయ్యారు. పెజెష్కియాన్, మోడి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ హార్మూజ్ జలసంధి అంశంలో చర్చ జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పెజెష్కియాన్, మోడి మధ్య జరిగిన భేటీ గురించి భారత్‌లో ఇరాన్ ఎంబసీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
బిష్కెక్ బయలుదేరే ముందు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. అయితే తమపై జరిగే దాడులకు బలంగా, దృఢంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో అస్థిరత అన్ని దేశాలకు నష్టమేనని అన్నారు. ఆర్థిక, భద్రతా లక్ష్యాల కోసం దేశాల మధ్య సహకారం అవసరమని పేర్కొన్నారు. అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తోనూ మోడి భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థికం, ఔషధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచే అంశాలపై చర్చించారు. పశ్చిమాసియాలో పరిస్థితితో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అర్మేనియాతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడి తెలిపారు. తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడి భేటీ కానున్నారు. కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఆరో ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలోనూ మోడి పాల్గొననున్నారు.







కామెంట్‌లు (0)