ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సచివాలయ ఉద్యోగులపై ఉక్కుపాదం

4 గంటల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 10:56 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- పలువురికి గాయాలు

- వేలాదిమంది అరెస్టు

- ఉద్రిక్తంగా చలో విజయవాడ

- 11 గంటల పాటు కొనసాగిన ఆందోళన

- 28న కలెక్టరేట్ల ముట్టడి

- 29న సామూహిక అటెండన్స్‌ బహిష్కరణకు పిలుపునిచ్చిన ఉద్యోగుల జెఎసి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: సమస్యలు పరిష్కరించాలని కదం తొక్కిన స్వర్ణగ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా నిరసన చేసేందుకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఎపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు అనూరాధతో పాటు పలువురు గాయాలపాలయ్యారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించాలని, నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌‌మెంట్‌ ‌స్కీం అమలు చేయాలని, నిర్దిష్ట ప్రమోషన్‌ ‌చానల్‌ ‌కల్పించాలని, నష్టదాయకమైన జిఓ 11ను రద్దు చేయాలని, సర్వేల భారం తగ్గించాలని, జిఓ 5 ప్రకారం రేషనలైజేషన్‌ ‌ప్రక్రియను పున:సమీక్ష చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ సచివాలయ ఉద్యోగుల జెఎసి ఆదివారం చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులపై నిర్బంధాలు విధించడంతో పాటు కొంతమంది యూనియన్‌ ‌నాయకులను సస్పెండ్‌ ‌చేసింది. విజయవాడకు చేరుకోకుండా జిల్లాల్లో ఎక్కడికక్కడే అరెస్టులు చేయించడంతో పాటు అధికారులతో బెదిరించింది. ఈ నిర్బంధాలను, అడుగడుగునా పోలీసులు విధించిన అడ్డంకులను చేధించుకుంటూ వేల సంఖ్యలో ఉద్యోగులు విజయవాడలోని ధర్నా చౌక్‌‌కు నలుదిక్కుల నుంచి చేరుకున్నారు. ఉద్యోగులను నిలువరించేందుకు ముందుగానే అక్కడ బారికేడ్లతో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు సైతం అడ్డుకోలేకపోయారు. ఎట్టకేలకు ఉద్యోగులు ధర్నాచౌక్‌‌లో శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ధర్నా చౌక్‌, లెనిన్‌ ‌సెంటర్‌ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగులు భారీగా చేరుకుని నినాదాలు చేశారు. అయితే మధ్యాహ్నం భోజన సమయంలో పోలీసులు.. ఉద్యోగులను బెదిరిస్తూ, వారిపై దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు, అసోసియేషన్‌ ‌నాయకులు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంలోనే ఉద్యోగులపై లాఠీఛార్జీ చేశారు. ఈ సమయంలోనే నాయకులను, వేలాది మంది ఉద్యోగులను పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి కృష్ణా, ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లాల్లో పలు స్టేషన్లకు తరలించారు. అనూరాధను నున్న పోలీస్టేషన్‌‌కు, ఎపి గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు షేక్‌ అబ్దుల్‌ ‌రజాక్‌‌ను కృష్ణా జిల్లాలోని పెద్దపారూపూడి పోలీస్టేషన్‌‌కు తరలించారు. ధర్నా విరమించకపోతే కేసులు పెడతామని పోలీసులు బెదిరించినా ఉద్యోగులు లెక్కచేయలేదు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళనను విరమించేది లేదని రోడ్డుపైనే రాత్రి 8.30 గంటల వరకు బైఠాయించారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సుమారు 11 గంటల పాటు నిరంతరాయంగా ఆందోళన కార్యక్రమాన్ని ఉద్యోగులు కొనసాగించారు. ఈ ధర్నాకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు ఆర్‌‌వి నరసింహారావు, డి రమాదేవి సందర్శించి మద్దతు తెలిపి అరెస్టయిన వారిని పోలీస్టేషన్లలో పరామర్శించారు.

డిమాండ్లు పరిష్కరించాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని అంతకుముందు జరిగిన ధర్నాలో సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులు షేక్ మహమ్మద్‌ బాషా, బి జగదీష్‌, శ్రీనివాస్‌, గిరి ‌మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1.17 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. తమపై పని ఒత్తిడి పెరిగిందని, ఈ ఒత్తిడితో కొంతమంది ఉద్యోగులు కూడా మరణించారని చెప్పారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తొమ్మిది నెలల జీతం ఎరియర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందుస్తుగా అరెస్టులు చేసిన ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని, 29న నిరసన సామూహికంగా అటెండన్స్‌‌ను బహిష్కరిస్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 30న మరలా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు.

​సమస్యల పరిష్కారంపై సానుకూలం : సిఎంఒ సిబ్బంది

‌స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉద్యోగుల నోషనల్‌ ఇంక్రిమెంట్లపై ఆర్థికశాఖ నివేదిక అనంతరం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. అయితే ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగోన్నతులకు చానల్‌ ‌కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ 244ను మున్సిపల్‌, పట్టణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ ‌సురేష్‌‌కుమార్‌ ఆదివారం విడుదల చేశారు.

నిర్బంధం నడుమ విజయవాడకు సచివాలయం ఉద్యోగులు

- తిరిగి పెదకాకానికి తీసు‌కొచ్చిన పోలీసులు

చలో విజయవాడ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉద్యోగులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. విజయవాడ ధర్నా చౌక్‌‌కు చేరుకున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పెదకాకాని పోలీస్టేషన్‌‌కు తరలించారు. ఆదివారం ఉదయం నుంచే కాజ టోల్‌ గేటు వద్ద పోలీసులు తనిఖీలు చేసి విజయవాడ వెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. వీరిని కొద్దిసేపటి తరువాత బైండోవర్‌ ‌చేయించుకుని విడుదల చేశారు. జిల్లా అంతటా ఎక్కడికక్కడ తీవ్ర నిర్బంధం అమలు చేశారు. ఉద్యోగులు మాత్రం వేర్వేరు మార్గాల్లోనూ, ఎక్కువ మంది దిచక్ర వాహనాల ద్వారా, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎక్కువ మంది రైళ్ల ద్వారా విజయవాడ వెళ్లారు. ప్రభుత్వ నిర్బంధంపై తీవ్ర నిరసన తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్