శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో లబ్ధిదారులకు ఆస్తి హక్కు పత్రాలు అందించిన సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

CM Chandrababu handed over property rights documents to beneficiaries in Visakhapatnam.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 04:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విశాఖ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు ఆస్తి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని 28,445 కుటుంబాలు ఇండ్ల పత్రాలను అందుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇళ్ల స్థలాల కోసం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించింది. ఈ క్రమబద్ధీకరించిన స్థలాలకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందించారు. పంపిణీ చేసిన ఈ ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.8,874 కోట్లు ఉంటుందని అంచనా. ఈరోజు ఉదయం విశాఖపట్నానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పట్టాల పంపిణీ కార్యక్రమం అనంతరం చంద్రబాబు లబ్ధిదారులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. వేదికపై ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ఆయన లబ్ధిదారులను, సభకు హాజరైన వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాటు పలువురు కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ .... పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ఇళ్లపై హక్కులు కల్పిస్తున్నామన్నారు. 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. దశాబ్దాల కష్టాలు, అనిశ్చితికి నేటితో ముగింపు పలుకుతున్నామన్నారు. అభ్యంతరం లేని భూముల్లో పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. 'మీరు ఉండే ఇళ్లపై ఇకనుంచి సర్వహక్కులు మీవే`నన్నారు. వీటిపై బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చునన్నారు. ఇంకా 35 కాలనీల్లోని 10 వేలమంది పట్టాలు కోరుతున్నారని తెలిపారు. సింహాచలం దేవస్థానానికి చెందిన పంచగ్రామాల్లో 12,149 మందికి పట్టాలు ఇవ్వాలని, మిగతావారికి త్వరగా పట్టాలు ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. పేదలకు శాశ్వత చిరునామా కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. విశాఖ త్వరలో విశ్వనగరంగా మారుతుందని చంద్రబాబు అన్నారు. అల్లూరి విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చాయన్నారు. ఈ నగరం టూరిజం, లాజిస్టిక్స్‌కు హబ్‌గా మారనుందని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ త్వరలో విశాఖకు వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్