శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games - నాగోయాలో ఆసియా క్రీడలకు ఘనంగా శ్రీకారం

1 గంట క్రితం

games
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 04:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

త్రివర్ణ పతాకంతో భారత బృందానికి మనూ భాకర్‌, పవన్‌ సెహ్రావత్‌ నాయకత్వం

45 దేశాల నుంచి 11 వేల మందికిపైగా క్రీడాకారులు


నాగోయా : జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా 20వ ఆసియా క్రీడలకు శనివారం ఘనంగా శ్రీకారం చుట్టారు. నాగోయాలోని పాలొమా మిజుహో స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో జపాన్‌ సంస్కృతి, ఆధునిక సాంకేతికతల సమ్మేళనం ఆకట్టుకుంది. జపాన్‌ చక్రవర్తి నరుహితో అధికారికంగా క్రీడలను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆసియా దేశాల మధ్య స్నేహం, ఐక్యత, క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించారు.


‘హార్మోనిక్‌ హార్ట్‌బీట్‌’ (సామరస్య హృదయ స్పందన) ఇతివృత్తంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రూపొందించారు. హృదయాకార వేదిక, ఆధునిక లైటింగ్‌, దృశ్య ప్రదర్శనలు, జపాన్‌ సంప్రదాయ కళారూపాలతోపాటు పారిశ్రామిక రోబోలు, ఆధునిక రవాణా సాంకేతికతను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయం–సాంకేతికతల కలయికతో జపాన్‌ తన ప్రత్యేకతను చాటుకుంది.


భారత బృందానికి భాకర్‌, సెహ్రావత్‌ నాయకత్వం

ప్రారంభోత్సవంలో భారత బృందం త్రివర్ణ పతాకంతో ఉత్సాహంగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంది. ఒలింపిక్‌ పతక విజేత షూటర్‌ మనూ భాకర్‌, కబడ్డీ స్టార్‌ పవన్‌ సెహ్రావత్‌ భారత పతాకధారులుగా వ్యవహరించారు. తొలుత భాకర్‌తోపాటు షాట్‌పుట్‌ క్రీడాకారుడు తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ పతాకధారిగా ఎంపికయ్యారు. అయితే అధికారిక కిట్‌ సమయానికి అందకపోవడంతో తూర్‌ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయారు. దీంతో చివరి నిమిషంలో పవన్‌ సెహ్రావత్‌ను పతాకధారిగా ఎంపిక చేశారు.


2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనూ భాకర్‌కు ఇది మూడో ఆసియా క్రీడల అనుభవం. మరోవైపు పవన్‌ సెహ్రావత్‌ గత ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత కబడ్డీ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఈసారి కూడా భారత కబడ్డీ జట్టు పతకంపై దృష్టి పెట్టింది.


43 క్రీడాంశాల్లో పోటీలు


ఈసారి ఆసియా క్రీడల్లో 45 దేశాలు, ప్రాంతాలకు చెందిన 11 వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 43 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. 369 స్వర్ణ పతకాల కోసం క్రీడాకారులు తలపడనున్నారు. బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ వంటి కొన్ని క్రీడల పోటీలు ప్రారంభోత్సవానికి ముందే మొదలయ్యాయి. తొలి స్వర్ణ పతకం ఆదివారం అందనుంది.


ఒలింపిక్స్‌లో సాధారణంగా కనిపించే క్రీడలతోపాటు ఆసియా దేశాలకు ప్రత్యేకమైన కబడ్డీ, కురాష్‌, సెపక్‌ టక్రా వంటి క్రీడలు కూడా ఈ క్రీడల్లో ఉన్నాయి. టెక్‌బాల్‌, పాడెల్‌, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌, వర్చువల్‌ క్రీడలు వంటి కొత్త విభాగాలు కూడా ఈసారి ఆకర్షణగా నిలవనున్నాయి.


image


ప్రారంభానికి ముందే సమస్యలు


అయితే నాగోయా క్రీడల నిర్వహణకు ముందు నుంచే కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. సంప్రదాయంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే క్రీడాగ్రామాన్ని ఈసారి నిర్మించకపోవడంతో క్రీడాకారులు హోటళ్లు, ఇతర వసతి కేంద్రాలు, నిలిపి ఉంచిన క్రూయిజ్‌ నౌకల్లో ఉండాల్సి వచ్చింది. గదుల పరిమాణం, రవాణా, వసతి కేటాయింపులకు సంబంధించి కొన్ని బృందాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.


భారత బృందానికి కూడా అధికారిక కిట్‌ అందడంలో జాప్యం ఏర్పడింది. తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ను చివరి నిమిషంలో పతాకధారి బాధ్యత నుంచి తప్పించడానికి ఇదే కారణమైంది. క్రీడల నిర్వహణలో తలెత్తిన ఈ సమస్యల మధ్య ప్రారంభోత్సవం సజావుగా పూర్తవడం నిర్వాహకులకు ఊరట కలిగించింది.


క్రీడా వేదికపై పోటీలు ఇప్పటికే మొదలైనప్పటికీ శనివారం జరిగిన ప్రారంభోత్సవంతో 20వ ఆసియా క్రీడల అధికారిక వేడుకలకు తెరలేచింది. ఆసియా ఖండంలోని క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలిచే ఈ క్రీడల్లో భారత బృందం గత ఆసియా క్రీడల ప్రదర్శనను అధిగమించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. 16 రోజులపాటు జరిగే ఈ క్రీడా సంబరాల్లో పతకాల కోసం భారత క్రీడాకారులు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్