న్యూఢిల్లీ : దేశ యువత ప్రతిభ, సామర్థ్యాలకు భారత స్టార్టప్ వ్యవస్థే నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోడి అన్నారు. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన స్టార్టప్‌లు ప్రస్తుతం చిన్న పట్టణాలు, నగరాలకూ విస్తరించాయని తెలిపారు. 20 వ రోజ్‌గార్ మేళా సందర్భంగా ... శనివారం ఆయన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 51 వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలను అందజేశారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని, గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో దాదాపు సగం టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉన్నాయని మోడి తెలిపారు. చిన్న పట్టణాల యువత సొంత ఆలోచనలతో సంస్థలను నెలకొల్పుతూ ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు సుమారు రూ.లక్ష కోట్లతో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ ను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా దాదాపు రెండు కోట్ల మంది యువత తొలిసారి ఉద్యోగ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి రూ.15 వేల వరకు ప్రోత్సాహకం అందించడంతో పాటు కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలకు కూడా ప్రోత్సాహకాలు ఉంటాయని వివరించారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే వారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని సేవలందించాలని ప్రధాని సూచించారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంచుకోవడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం అవసరమన్నారు. ఇందుకోసం ‘మిషన్ కర్మయోగి’ ను రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే 1.70 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ‘iGOT కర్మయోగి’ వేదికలో చేరారని, కొత్త ఉద్యోగుల కోసం ‘కర్మయోగి ప్రారంభ్’ కార్యక్రమాన్ని సిద్ధం చేసినట్లు మోడి వెల్లడించారు.
స్టార్టప్ లే భారత యువత సత్తాకు నిదర్శనం : ప్రధాని మోడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)