ప్రజాశక్తి - యంత్రాంగం : ఎపిలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సిపిఎం అభ్యర్థులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటిఎంసి) ఎన్నికల్లో సిపిఎం తరుఫున కార్పొరేటర్ అభ్యర్థులుగా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. 14వ డివిజన్ నుండి యు.దుర్గారావు, 18వ డివిజన్ నుండి ఉయ్యాల తిరుపతమ్మ, 19వ డివిజన్ నుండి వివి జవహర్‌లాల్, 31వ డివిజన్ నుండి సింహాద్రి ఆది శేఖర్, 34వ డివిజన్ నుండి పిల్లలమర్రి బాలకృష్ణ, 46వ డివిజన్ నుండి వేముల రమణ, 47 డివిజన్ నుండి అడ్డగట్ల బాలచిన్నమ్మ, 56వ డివిజన్ నుండి గాదే కోటేశ్వరి తమ నామినేషన్ పత్రాలను ఆయా కార్యాలయాల్లో అందజేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని 18, 19 డివిజన్‌లలో సిపిఎం అభ్యర్థులు ఉయ్యాల తిరుపతమ్మ, వివి జవహర్‌లాల్ ర్యాలీగా బయలుదేరి డప్పుల మోతతో ప్రదర్శనగా వెళ్లారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా వినుకొండ మండలంలోని విఠంరాజుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం పల్నాడు జిల్లా నాయకులు కొత్తపల్లి హనుమంత్‌రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షునిగా, సిపిఎం వినుకొండ డివిజన్ కార్యదర్శిగా గతంలో పని చేశారు. మార్కాపురం జిల్లా పామూరు పంచాయతీ 15వ వార్డు మెంబర్ అభ్యర్థిగా సయ్యద్ గౌస్ బాషా నామినేషన్ వేశారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే సిపిఎం అభ్యర్థులను ప్రజలు ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా కోరారు.
నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పసుపులేటి పెంచలయ్య, 33వ వార్డు అభ్యర్థిగా పసుపులేటి వెంకటలక్ష్మి నామినేషన్ వేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.మోహన్ రావు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ బరిలో 17వ వార్డులో బొంతు ధనలక్ష్మి, 33వ వార్డులో చంద్రగిరి లక్ష్మీ తిరుపతమ్మ, 46వ వార్డులో ఆర్‌సిపి రెడ్డి నామినేషన్ వేశారు. తాడిగడప 7వ వార్డు సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థిగా తరిగొప్పల లావణ్య నామినేషన్ పత్రాలు పోరంకి ప్రభునగర్‌లోని సచివాలయంలో ఎన్నికల అధికారులకు అందజేశారు.







కామెంట్‌లు (0)