సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమిలో భగ్గుమన్న విభేదాలు...

5 గంటల క్రితం

కూటమిలో భగ్గుమన్న విభేదాలు
- సర్పంచ్‌ పదవి కోసం తీవ్ర ఉద్రిక్తత 
- అచ్యుతాపురం టిడిపి కార్యాలయంలో విధ్వంసకాండ 
- రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావుపై కార్యకర్తలు దాడి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 11:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సర్పంచ్‌ పదవి కోసం తీవ్ర ఉద్రిక్తత

- అచ్యుతాపురం టిడిపి కార్యాలయంలో విధ్వంసకాండ

- రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావుపై కార్యకర్తలు దాడి

ప్రజాశక్తి - అచ్యుతాపురం (అనకాపల్లి) : గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండల టిడిపి కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన అభిప్రాయాల సేకరణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టిడిపి యలమంచిలి నియోజకవర్గ ఇన్‌‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావుపై ఆ పార్టీకే చెందిన కొందరు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని కుర్చీలను గోడకు, నేలకు బాదుతూ విధ్వంసకాండ సృష్టించారు. ఫర్నిచర్‌ ‌ధ్వంసం చేశారు. దీంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి పార్టీల ఒప్పందం ప్రకారం జనసేనకు మండలంలో కొన్ని పంచాయతీలు కేటాయించాల్సి వస్తుందని నాగేశ్వరరావు చెప్పడంతో పూడిమడక గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వెలిబుచ్చారు. ఆ గ్రామ సర్పంచి స్థానాన్ని సర్దుబాటుల్లో జనసేన మద్దతుదారుకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతుండటంతో వారంతా అప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారు. ఆదివారం నాటికి ఆ అసంతృప్తి మరింత పెరిగింది. ఈ క్రమంలో పార్టీ నాయకుడు మెరుగు బాపునాయుడు గ్రూపునకు చెందిన సుమారు వందమంది టిడిపి కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ప్రగడ నాగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. సర్పంచ్‌ ‌స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో మిగిలిన ప్రాంతాల వారూ అవాక్కయ్యారు.

​

జర్నలిస్టు సహా పలువురికి గాయాలు

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వార్తా సేకరణకు వచ్చిన ఆంధ్రప్రభ విలేకరి డి.అప్పలనాయుడుపైనా దాడి జరిగింది. తన దుస్తులు చింపి, చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కొని, అందులోని డేటాను తొలగించి, బలంగా నెట్టివేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఘటన విషయమై ఐదుగురు వ్యక్తులపై పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసినట్టు ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. దాడికి సూత్రధారి అయిన బాపునాయుడును తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తుల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. తనపై జరిగిన దాడిని పేర్కొంటూ విలేకరి అప్పలనాయుడు కూడా పోలీస్‌ ‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ టికెట్ల కేటాయింపు ప్రక్రియలో మొదలైన విభేదాలు పార్టీ కార్యాలయంలో దాడులు, విధ్వంసం వరకూ దారితీయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్