- తుళ్లూరు డి ఎస్ పి అసత్యాలు ప్రచారం
- ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ
ప్రజాశక్తి - తుళ్లూరు : పోలీసుల అక్రమ నిర్బంధం, చిత్రహింసల వల్లే తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళితుడు చీకటి గోపి చనిపోయాడని, ఈ విషయమై తుళ్లూరు డి ఎస్ పి మురళీకృష్ణ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ అన్నారు. గోపి మృతికి పోలీసులు బాధ్యత వహించాలన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో ఆదివారం చీకటి గోపి కుటుంబసభ్యులతో మందా కృష్ణ మాదిగ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపి జ్వరం, ప్లేట్ లెట్లు పడిపోవడం వల్ల చనిపోయాడని, తాము కొట్టలేదని అంటున్నారని, గత నెల 25వ తేదీన ఓ కేసు విషయమై గోపిని తాడికొండ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి 27వ తేదీన పంపించారని చెప్పారు. అక్రమంగా రెండు రోజులు పోలీసు స్టేషన్ లో ఎందుకు ఉంచారు. కాళ్లపైన కొట్టిన గాయాలున్నాయని, వళ్లంతా ఛిద్ర మైందని చెప్పారు.అందుకు సంబంధించిన పోటోలను చూపారు. గోపి మృతి ఉదంతంపై సీనియర్ ఐపిఎస్ అధికారితో నిష్పక్షపాతంగా విచారణ చేస్తే నిజాలు వెల్లడవుతాయని అన్నారు. కరుడుగట్టిన నేరస్తులైనా అనేక సందర్భాల్లో తాము చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ పోలీసులకు లొంగిపోవడం చూశాం గానీ పొలీసులు తాము చేసిన తప్పులను తమకు తాముగా ఒప్పుకున్న దాఖలాలు ఎన్నడూ లేవన్నారు. 22 కేసులున్న సాయికృష్ణ కేసులోనూ లోతైన విచారణ జరిపాకే పోలీసుల పాత్ర వెల్లడైందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రఘురామ కృష్ణంరాజు కేసులోనూ పోలీసుల పాత్రపై విచారణ, అనంతర పరిణామాలను ఉదహరించారు. సాయికృష్ణ మృతిపై ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించిందని,దళితుడైన గోపి మృతిపై మాత్రం పోలీసులు, ఎస్ ఐ, సిఐపై దర్యాప్తుకు మరో సిఐ ను విచారణకు నియమించడం హాస్యాస్పదమన్నారు. 22 కేసులున్న సాయికృష్ణ మృతి తదనంతర పరిణామాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సాయికృష్ణ తల్లిని పిలిపించుకుని మాట్లాడారని చెప్పారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సాయికృష్ణ ఇంటికి వెళతారని, పేద దళితుడైన గోపి కుటుంబసభ్యులను మాత్రం ప్రభుత్వం పిలవదని, దళిత ఎమ్మెల్యేలు సైతం పలకరించరని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సైతం గోపి కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత దళితురాలని, విధినిర్వహణలో తగిన స్వేచ్ఛ లేదన్నారు. రాష్ట్రంలో అనేకచోట్ల 20 మందికి పైగా దళితులు హత్యకు గురైతే పరామర్శకు వెళ్లేందుకు కూడా ఆమెకు స్వేచ్ఛ లేదని అర్ధమవుతోందని మందా కృష్ణ మాదిగ అన్నారు. శాంతి భద్రతలపై ముఖ్యమంత్రితో జరిగే సమావేశాలకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నారని నిలదీశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సాయికృష్ణ కేసు, గోపి కేసులో తేడా చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మందా కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. గోపి కుటుంబానికి రూ 25 లక్షలు ఇవ్వాలని, సీనియర్ ఐపిఎస్ అధికారితో విచారణ జరిపించాలని, గోపి మృతికి బాధ్యులైన పోలీసులపై అక్రమ నిర్బంధం, కొట్టడం, ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గోపి కుటుంబానికి తగు న్యాయం చేయనిపక్షంలో దళితులందరం ఐక్యమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. తాము ఏ రాజకీయ పార్టీ జెండా మోయలేదని, దళితుల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి భంగం వాటిల్లితే ఎవరినీ ఉపేక్షించ బోమన్నారు. సమావేశంలో ఎం ఆర్ పి ఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ తదితరులున్నారు.








కామెంట్‌లు (0)