న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలకడానికి చర్చలు, దౌత్యమే మార్గమని విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర అన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన 'మ్యూనిచ్ లీడర్స్ మీటింగ్'లో "న్యూఢిల్లీ నుంచి కొత్త దిశగా.. అభివృద్ధి చెందుతున్న, మధ్యస్థాయి శక్తుల మధ్య సహకారానికి అవకాశాలు" అనే అంశంపై ఆయన ప్రసంగించారు. రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలకడానికి చర్చలు, దౌత్యమే మార్గమని అన్నారు. ఈ విషయంలో భారత్ కేవలం తన వైఖరిని వ్యక్తం చేయడానికే పరిమితం కాకుండా, రష్యా, ఉక్రెయిన్‌లతో సంప్రదింపులు జరుపుతూ పరిష్కారానికి తన వంతు కృషి చేస్తోందని తెలిపారు. ఈ వివాదంతో పాటు నల్ల సముద్రం భద్రత, ధాన్యం ఎగుమతి ఒప్పందాల విషయంలో కూడా భారతదేశం కేవలం వాదనలకే పరిమితం కాకుండా ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా రష్యా, ఉక్రెయిన్ రెండింటితోనూ సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.
నల్ల సముద్రంలో నౌకాయాన భద్రత అంశంతో పాటు , ధాన్యపు ఎగుమతులు, ఇంధన ఎగుమతులు, పరస్పరం దాడులకు దిగకుండా ఉండటం వంటి తక్షణ ఆందోళనల పరిష్కారంలో కూడా సహాయపడటానికి తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆ దిశగా సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు. రష్యాతో ఉన్న సంబంధాలపై స్పందిస్తూ.. తమ భద్రత, ప్రాదేశిక సమగ్రత ముప్పులో ఉన్నప్పుడు, అలాగే తమ పక్కనే ఉన్న ఒక సైనిక పాలనకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచంలోని చాలా దేశాలు మొగ్గు చూపిన సమయంలో కూడా రష్యా, అంతకుముందు సోవియట్ యూనియన్ భారత్‌కు అండగా నిలిచాయని జయశంకర్ పేర్కొన్నారు. చారిత్రక సంబంధాలు, వారసత్వం తమ రెండు దేశాల సంబంధాలను తీర్చిదిద్దాయని అన్నారు. భారతదేశ ప్రయోజనాలు రష్యా ప్రయోజనాలతో ఏకీభవిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యక్షంగా ప్రమేయం లేని దూర ప్రాంతాల్లోని సంఘర్షణల ప్రభావాన్ని భారత్ కూడా ఎదుర్కొంటోందని అన్నారు. ఇంధన సరఫరా, వాణిజ్యం, రవాణా వ్యవస్థలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. ప్రపంచ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అమెరికా విధానంలో మార్పులు, చైనా ఎదుగుదల, అవకాశాలు లేదా వనరులను ఆయుధాలుగా ఉపయోగించే ధోరణి వంటి పరిణామాలు ప్రధాన కారణాలని జయశంకర్ పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)