ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో సాయంకాల కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ (ఐలు) వ్యతిరేకిస్తున్నట్లు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ అంకయ్య, ఎన్ మాధవరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాయంకాల కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఈ నెల 28న విజయవాడలో జరిగిన సమావేశంలో చేసిన తీర్మానానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనను విరమించుకునే వరకు న్యాయవాదులతో కలిసి ఐలు పోరాడుతుందని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులు తగ్గించడానికి సాయంకాల కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తుందని, ఇది వాస్తవ విరుద్ధమన్నారు. పెండింగ్ కేసులు పరిష్కారానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలైన జనాభా ప్రాతిపదికన న్యాయస్థానాల ఏర్పాటు, న్యాయమూర్తుల ఖాళీల భర్తీ, న్యాయశాఖ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడం, న్యాయస్థానాల్లో అవసరమైన సాంకేతికను అభివృద్ధి చేయటం, ప్రస్తుతం ఉన్న న్యాయస్థానాలను క్రమబద్ధంగా పనిచేసేటట్లు చూడటం వంటి చర్యలను విస్మరించి, ఆచరణ సాధ్యం కాని, సాయంకాల కోర్టుల ఏర్పాటు చేయడమనేది ఏ విధంగానూ సమంజసం కాదన్నారు. సాయంకాల కోర్టుల వలన ప్రజలకు నాణ్యమైన న్యాయవాద సర్వీసులను న్యాయవాదులు అందించలేరని, తద్వారా కక్షిదారులు నష్టపోతారని తెలిపారు. సాయంకాల కోర్టుల ఏర్పాటుకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేశారు.
సాయంకాల కోర్టులొద్దు : ఐలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)