ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి

1 గంట క్రితం

sms
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 10:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ధైర్యంగా, నిజాయితీగా జెన్ జీ న్యాయాధికారుల నిర్ణయాలు

- నిర్దిష్ట గడువులోగా రిజర్వ్ తీర్పుల వెల్లడి

- న్యాయవ్యవస్థకు ట్రయల్ కోర్టులే వెన్నెముక

- సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : న్యాయాధికారులు తమ అంతరాత్మకు కట్టుబడి, నిష్పక్షపాతంగా, నిర్భయంగా తీర్పులు వెలువరించాలని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సూచించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడటంలో ట్రయల్ కోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని, యువ జెన్ జీ న్యాయాధికారులు ధైర్యంగా, నిజాయితీతో నిర్ణయాలు తీసుకుంటూ, కేసుల పరిష్కారంలో సకాలంలో న్యాయం అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హైకోర్టు ఆధ్వ‌ర్యంలో విజయవాడలో బి.ఆర్‌.అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో 3వ రాష్ట్ర‌స్థాయి న్యాయాధికారుల స‌ద‌స్సు ఆదివారం జ‌రిగింది. స‌ద‌స్సులో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టితో పాటు రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ లిసా గిల్, హైకోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హారీ, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ నినాల జయసూర్య త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ... సామాన్య పౌరునికి రాజ్యాంగ సజీవ ఆత్మ ఢిల్లీలో కాకుండా, వారికి అత్యంత చేరువలో ఉన్న ట్రయల్ కోర్టులలోనే కనిపించాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రతి పది కేసుల్లో దాదాపు తొమ్మిది కేసులు జిల్లా, దిగువస్థాయి న్యాయస్థానాల్లోనే ఉన్నందున, న్యాయస్థానాలు సామాన్య ప్రజలకు మరింత చేరువ కావాల‌న్నారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సరస వెంకట నారాయణ భట్టి మాట్లాడుతూ... న్యాయవ్యవస్థ పురోగతి, న్యాయపరిపాలనలో న్యాయాధికారుల పాత్ర, బాధ్యతలను చర్చించుకోవడానికి ఈ స‌ద‌స్సును ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. విధుల‌పై ఆసక్తి, అంకితభావమే ముందుకు నడిపిస్తాయని న్యాయాధికారుల‌ను ఉద్దేశించి అన్నారు. ​మాతృ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ పనితీరు దేశంలోనే ఎవరికీ తీసిపోని విధంగా ఉందని, త‌న సుదీర్ఘ న్యాయవాద వృత్తిలో ఎందరో గొప్ప న్యాయమూర్తుల నుండి నేర్చుకున్న విషయాలే త‌న‌ను ఈ స్థాయికి తెచ్చాయన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ.. ‘న్యాయం చెప్పడం సులభం, న్యాయం చేయడం కష్టం’ అనే నానుడిని ప్రస్తావిస్తూ, న్యాయ వ్యవస్థకు ట్రయల్ కోర్టుల న్యాయాధికారులే అసలైన పునాది అని పేర్కొన్నారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అనే గురజాడ అప్పారావు గారి మాట‌ల‌ను చెబుతూ న్యాయస్థానాల్లో పనిచేసే వ్యక్తుల ప్రవర్తన, సాక్షులను గౌరవించే తీరు, కేసులను సత్వరమే పరిష్కరించే విధానం ద్వారానే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ-ఫైలింగ్, వర్చువల్ హియరింగ్స్ వంటి సాంకేతిక మార్పులు ఆహ్వానించదగినవే అయినప్పటికీ, అదే స‌మ‌యంలో మారుమూల గ్రామాల నుండి వచ్చే సామాన్య కక్షిదారులకు తమ కేసు ఎందుకు వాయిదా పడిందో స్థానిక భాషలో స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడం అత్యంత ముఖ్యమని అన్నారు. స‌ద‌స్సులో రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ ప్రారంభ ఉప‌న్యాసం చేస్తూ రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులను కాపాడటంలో న్యాయవ్యవస్థ కీలక పాత్రను పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ ర‌వినాథ్ తిల్హారీ, జ‌స్టిస్ బి. కృష్ణ‌మోహ‌న్, జస్టిస్ టి.సి.డి. శేఖర్, జ‌స్టిస్ సునీత గంధం, జస్టిస్ సుభేందు సమంత, జస్టిస్ కె. సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్