శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తండ్రి నుంచి తాత్కాలిక భరణం ఇప్పించండి

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 11:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- హైకోర్టును ఆశ్రయించిన బాలిక

ప్రజాశక్తి-అమరావతి : తన పోషణ, విద్య, వైద్య అవసరాలతో పాటు ఇతర ప్రాథమిక అవసరాల కోసం తండ్రి నుంచి తాత్కాలిక భరణం ఇప్పించాలని కోరుతూ తొమ్మిదేళ్ల బాలిక హైకోర్టును ఆశ్రయించింది. తన తల్లి నాగలక్ష్మి ఒంగోలు కోర్టులో దాఖలు చేసిన భరణం పిటిషన్‌తో పాటు తాత్కాలిక భరణం కోరిన అనుబంధ పిటిషన్‌పై ఏడాదిన్నరగా ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో తాము తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలోని జగిత్యాలలో రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న తన తండ్రి జాడ వినీల్‌కుమార్‌కు నెలకు సుమారు రూ.1.70 లక్షల వేతనంతో పాటు ఇతర ఆస్తులు కూడా ఉన్నప్పటికీ తన నిర్వహణ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించింది. నెలకు రూ.50 వేల భరణం, కనీసం రూ.40 వేల తాత్కాలిక భరణం మంజూరు చేయాలని తన తల్లి దాఖలు చేసిన పిటిషన్లపై తక్షణ విచారణ జరిపేలా ఒంగోలు కోర్టును ఆదేశించాలని హైకోర్టును కోరింది. తన తండ్రి కావాలనే విచారణను జాప్యం చేసే ఉద్దేశంతో వరుస దరఖాస్తులు దాఖలు చేస్తున్నారని, డిఎన్‌ఎ పరీక్ష కోసం కూడా పిటిషన్ వేయడం ద్వారా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. ఈ ఆలస్యం వల్ల తన పోషకాహారం, విద్య, వైద్య అవసరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, పరిమిత వనరులతో తన తల్లి పాఠశాల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, రవాణా, వైద్య ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారిందని వివరించింది. వేగవంతమైన న్యాయ పరిష్కారం అనేది ముఖ్యంగా మైనర్ పిల్లల సంక్షేమానికి సంబంధించిన వ్యవహారాల్లో రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది. ఇతరులకు న్యాయం చేసే బాధ్యత నిర్వహిస్తున్న న్యాయాధికారి అయిన తన తండ్రి సొంత కుమార్తె పట్ల చట్టబద్ధమైన బాధ్యతను విస్మరిస్తున్నారని ఆరోపించింది. తనకు తక్షణమే సహేతుకమైన తాత్కాలిక భరణం చెల్లించేలా లేదా నిర్దిష్ట మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, అలాగే భరణం పిటిషన్‌ను రోజువారీ విచారణ చేపట్టి వీలైనంత త్వరగా పరిష్కరించేలా ఒంగోలు కోర్టును ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్