అస్సాం : అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. చరైదేవ్ జిల్లాలో మరో వ్యక్తి మృతి చెందడంతో ఈ ఏడాది వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 98 కి చేరినట్లు అధికారులు తెలిపారు.
గత రోజుతో పోలిస్తే వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 15 నుంచి 13కి తగ్గినప్పటికీ, ప్రజలపై వరద ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. గోలఘాట్ జిల్లాలో అత్యధికంగా 58,750 మంది నిరాశ్రయులు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో శివసాగర్ (48,286), జోహాట్ (25,259) జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుతం 1,55,849 మంది వరదలతో ఇబ్బంది పడుతున్నారు.
పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం 55 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 10 వేల మందికి పైగా నిరాశ్రయులు తలదాచుకుంటున్నారు. అలాగే 18 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో 10,748.64 హెక్టార్ల సాగు భూమి మునిగిపోగా, 47 వేలకు పైగా మూగజీవాలు ప్రభావితమయ్యాయని అధికారులు వెల్లడించారు.
తూర్పు అస్సాంలోని అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న నాలుగు జిల్లాల్లో శాశ్వత పునరావాస నిధుల విడుదలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆదివారం నుంచి సమగ్ర నష్ట అంచనా సర్వేను ప్రారంభించనుంది. జోహాట్, శివసాగర్, గోలఘాట్, చరైదేవ్ జిల్లాల్లో ఆగస్టు 9 నుంచి 30 వరకు ఇంటింటికీ తిరిగి వరద నష్టాన్ని అంచనా వేయనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు.
ఈ సర్వేలో ఏ ఒక్క ప్రభావిత కుటుంబాన్ని విస్మరించబోమని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి విశ్వశర్మ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలతో క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత, సెప్టెంబర్ 10 నాటికి పునరావాసానికి అవసరమైన నిధుల అంచనా వస్తుందని భావిస్తున్నారు. అంచనా అందిన వెంటనే శాశ్వత పునరావాసం కోసం ఆర్థిక సహాయం అందజేయడం ప్రారంభిస్తామని తెలిపారు.








కామెంట్‌లు (0)