విజయ డెయిరీ వ్యవహారం ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట’
జెన్‌జీ యువతపై వేధింపులు ఆపాలి
రాష్ట్రం మొత్తం జైలుగా మారింది
ఇథనాల్ పెట్రోలు పేరుతో దోపిడీ
ఆగస్టు 15న జాతీయ సమైఖ్యతా దినోత్సవం
24న ప్రజా సంఘాల చలో కలెక్టరేట్‌కు సిపిఎం మద్దతు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
విజయవాడ : ప్రజల సంపదను లూఠీ చేసి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పిపిపి పద్ధతిని ప్రవేశపెట్టిందని, నష్టమొచ్చినా ప్రభుత్వమే భరించేలా నిబంధనలకు ఆమోదం తెలిపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం విజయవాడలోని బాలోత్సవభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాధంతో కలిసి ఆయన మాట్లాడారు. రెండురోజులపాటు విజయవాడలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రైతాంగ సంక్షోభం, కరువు, ఏజన్సీలో ఆదివాసీ యువత సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర సంపద మొత్తం కార్పొరేట్లకు కట్టబెట్టేలా నూతన పిపిపి విధానాలు ఉన్నాయని అన్నారు. ఆస్తులు కట్టబెట్టిందిగాక వారికి నష్టమొస్తే ప్రభుత్వమే భరించేలా వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.1,500 కోట్లు కేటాయించి పూర్తి ప్రోత్సాహకాలు ఇస్తోందని తెలిపారు. ఇదేనా కార్పొరేట్ సమర్ధత అంటే అని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కూడా పిపిపి పద్దతిలోనే నిర్మించారని, రైతుల భూములు తీసుకుని అప్పనంగా అప్పగించారని, గత ప్రభుత్వం గంగవరం పోర్టును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఈ ప్రభుత్వం వైద్యకళాశాలలను అప్పగిస్తోందని అన్నారు. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మెడికల్ కళాశాలల పిపిపికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో విఫలమైందని తెలిపారు. మొక్కజొన్న, కాఫీ, కొకొవా, పొగాకు, మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మిర్చి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, పొగాకు రైతులకు కేజీకి రూ.10 ముష్టివేసినట్లు ఇస్తామంటున్నారని, కార్పొరేట్లకు నష్టంవస్తే చెల్లించేందుకు డబ్బులు కేటాయించిన ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. బడా కార్పొరేట్లకు వెండికంచంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తున్న ప్రభుత్వం రైతులకు బొచ్చెలో భిక్షం వేస్తున్నదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పిపిపి విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. విశాఖ స్టీలు ప్లాంటు ఉత్పత్తికి వీలుగా గ్యాస్ కేటాయించాలని కోరారు. ఇప్పటికే ఉత్పత్తి తగ్గిందని, మరోవైపు టాటా, జిందాల్ కంపెనీలు విశాఖ స్టీలు మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయని అన్నారు.
విజయ డెయిరీ ఛైర్మన్ రాజీనామా అప్రజాస్వామికం
కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలోని విజయడెయిరీని నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్ వాటాదార్లుగా ఉన్న హెరిటేజ్‌కు లాభం చేకూర్చడానికే అప్రజాస్వామికంగా ఛైర్మన్‌ను తొలగించారని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఈ వ్యవహారం “ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట” కిందకు వస్తుందన్నారు. సహకార రంగంలో డైరక్టర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న డెయిరీ ఛైర్మన్ ఆస్పత్రిలో ఉండగా మెడపై కత్తిపెట్టి బలవంతంగా రాజీనామా చేయించడం అన్యాయమని తెలిపారు. సహకారచట్టంలో నడుస్తున్న ఫ్యాక్టరీపై ప్రభుత్వ పెత్తనం అంటే వాటాదారులుగా ఉన్న వేలాదిమంది రైతులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. ఇప్పటికే సహకార షుగర్ ఫ్యాక్టరీలను నాశనం చేశారని, ఇప్ప్పుడు డైరీలో ఉన్న విజయ సహకార డైరీని కూడా కార్పొరేట్లకు అప్పగించేందుకు పూనుకోవడం దారుణమన్నారు.
ఏజెన్సీ యువతలో తీవ్ర అసంతృప్తి
ప్రభుత్వ విధానాలతో ఏజెన్సీ పరిధిలోని యువతలో తీవ్ర అసంతృప్తి ఉందని, వారితో చర్చించి సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. 1/70 చట్టంపై గిరిజనేతర భూస్వాములు దాఖలు చేసిన కేసులో వాదనలు వినిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. గతంలో జిఓ 3 విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. పంప్డ్ స్టోరేజీ, మైనింగ్ పేరుతో అడవులను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. దీనికి సమాధానం చెప్పకుండా యువతను బైండోవర్ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిఓ 3ను పునరద్దరించాలని, 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసును కొట్టివేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ పని చేయడానికి ప్రభుత్వానికి ఏమి అడ్డం వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
జైలుగా మారిన రాష్ట్రం
ప్రశ్నించిన వారిని నిర్బంధిస్తూ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక జైలుగా మార్చేసిందని అన్నారు. ఢిల్లీ ఉద్యమం తరువాత యువతపై వేధింపులు మరింత పెరిగాని తెలిపారు. పాత కేసులను తిరగదోడి ఇబ్బందులు పెడుతున్నారని, ఎసఎఫఐ అఖిల భారత నాయకులు అయిషీఘోష్‌ను అరెస్టు చేసే పేరుతో సిపిఎం కేంద్ర కార్యాలయంలపై దాడికి తెగబడ్డారని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌరవ్‌దాస్ ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. అభిజిత్ దీప్కే ఆదాయం పేరుతో ఆర్‌టిఐ పెట్టి అప్రతిష్టపాలు చేయాలని చూశారన్నారు. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ బయటపెట్టాలని ఆయన కోరితే కేంద్రం నోరెత్తడం లేదని, సమాధానం చెప్పలేక ప్రధాని, హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా ఇద్దరూ పార్లమెంటుకు కూడా మొహం చాటేశారని అన్నారు. ఆరఎసఎస్ అధినేత మోహన్ భగవత్ యువతపై దాడుల సమయంలో మౌనం పాటించి ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని అన్నారు.
ఇథనాల్ పెట్రోలు కుంభకోణమే
ఇథనాల్ ప్రెటోలు పేరుతో కేంద్రంలో బిజెపి పెద్దలు భారీ కుంభకోణానికి దిగారని అన్నారు. ఈ పెట్రోలు వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని, అన్ని తరగతుల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒకవేళ అమ్మాలి అనుకుంటే అవసరం ఉన్నవారు మాత్రమే వాడుకునేలా వేర్వేరు బంకులు ఏర్పాటు చేయాలని, రెగ్యులర్ పెట్రోలులో కలపొద్దని సూచించారు.
ఆగస్టు 15న జాతీయ సమైక్యతా దినోత్సవం
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిపిఎం ఆధ్వర్యాన జాతీయ సమైక్యతా దినోత్సవం జరపాలని, ఊరూవాడా పతాకావిష్కరణలు జరపాలని నిర్ణయించినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితుల అణచివేత, వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. చివరి సంస్కారమైన శ్మశానవాటికలు కూడా దళితులకు లేవని, ఉన్నవాటికి దారిలేదని, దారి ఉంటే సదుపాయాలు లేవని పేర్కొన్నారు. శ్మశానవాటికల కోసం ప్రభుత్వం 1235 జిఓ విడుదల చేసి ఇరవై ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయడం లేదని అన్నారు. ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ప్రశ్నించారు.
24న ప్రజా సంఘాల చలో కలెక్టరేట్‌కు మద్దతు
కులవివక్షకు వ్యతిరేకంగా దళితవాడల్లో సదుపాయాలు కల్పించాలని కోరుతూ కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సిపిఎం మద్దతు ఇస్తుందని శ్రీనివాసరావు ప్రకటించారు. గ్రామంలో పెత్తందారుల నివాస ప్రాంతాల్లో సదుపాయాలు కల్పించే ప్రభుత్వాలు దళితవాడలను పూర్తిగా విస్మరిస్తున్నాయని తెలిపారు. ఇటీవల జరిపిన సామాజిక శంఖారావం యాత్రలో ఇటువంటి సమస్యలు ప్రజా సంఘాల దృష్టికి చాలా వచ్చాయని, వాటిని పరిష్కరించాలని ఆగస్టు 24వ తేదీన చేటప్టనున్న కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
అడవితల్లిని చంపేసే బాట
పవన్ కల్యాణ్ అడవితల్లిబాట పేరుతో రూ.1000 కోట్లు కేటాయించామని చెబుతున్నారని, ఏజెన్సీలో ప్రధాన మండల కేంద్రమైన చింతూరులో ఐటిడిఏ అంబులెన్స్ నడిచేందుకు డీజిల్‌లేక ఆలస్యమై పసిబిడ్డ మరణించిన సంఘటన కలిచివేసిందని తెలిపారు. పవన్ కల్యాణ్ చేపట్టింది అడవితల్లి బాట కాదని, అడవి తల్లిని చంపేసే బాటని అన్నారు.
ఏజెన్సీ యువత రౌడీషీటర్లా, సంఘవిద్రోహశక్తులా : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం
ఏజెన్సీలో శాంతియుతంగా యువత ఆందోళన జరుపుతుంటే వారిపై కేసులు పెట్టడంతోపాటు, బైండోవర్ చేస్తున్నారని వారేమన్నా రౌడీషీటర్లు, సంఘవిద్రోహశక్తులా అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం ప్రశ్నించారు. సిపిఎం, గిరిజన సంఘం నాయకులపై కేసులుపెట్టి వేధిస్తున్నారని అన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని అన్నారు. ఆగస్టు 9న అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా అయినా గిరిజనులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కోరారు. ఆగస్టు 10వ తేదీన రైతు, కార్మిక సంఘాలు నిర్వహించతలపెట్టిన దేశవ్యాపిత జైల్‌భరో కార్యక్రమానికి సిపిఐ(యం) మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.







కామెంట్‌లు (0)