మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసనలు
అధికారులకు వినతులు అందజేత
ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వం 14 మున్సిపల్ సేవలను ప్రైవేటీకరిస్తూ విడుదల చేసిన 975, 673 జిఒలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నిరసనలు తెలిపారు. పలుచోట్ల ర్యాలీ, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. వినతిప్రతాలు అందజేశారు. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.సింహాచలం, సిఐటియు జిల్లా కార్యదర్శి బివి.రమణ, జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ తదితరులు మాట్లాడారు. సాలూరు పట్టణంలో బంద్ పాటించి, నిరసన తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయం వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీ మెయిన్ రోడ్డు మీద పోస్ట్ ఆఫీస్, బోసు బొమ్మ వరకు సాగింది. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు, సాలూరు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు టి.రవి, పి.శంకర్రావు మాట్లాడారు. పాలకొండలో నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు, అనంతరం ఎంఎల్ఎ నిమ్మక జయకృష్ణ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు.
అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జివిఎంసి అనకాపల్లి జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జివిఎంసి జోనల్ కమిషనర్ డాక్టర్ లక్ష్మీతులసికి వినతిపత్రం అందించారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని గాంధీ విగ్రహం వద్ద, ఆమదాలవలసలోని మోణింగివారి వీధిలోని మస్టర్ పాయింట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి మాట్లాడారు.








కామెంట్‌లు (0)