mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​మానవీయ కోణంలో అర్జీల పరిష్కారం

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 01:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆర్ టిజిఎస్‌ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజాఫిర్యాదుల గ్రీవెన్స్‌ ‌సెల్‌(పిజిఆర్‌ఎస్‌) సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ఆర్‌‌టిజిఎస్‌ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై ‌సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని అన్నారు. ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తే పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు తమ వద్దకు వచ్చే పౌరులతో సౌమ్యంగా వ్యవహరిస్తే పాలనపై ప్రజల్లో మంచి భావన కలుగుతుందన్నారు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు ఉద్యోగులు పాలనా పరంగా సామర్ధ్యాలను పెంచుకోవాలని సూచించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యమివ్వాలని, అలా చేస్తే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలుగుతామని చెప్పారు. పాత రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి పెద్ద టాస్క్ గా ఉండేదని, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సులభంగా వాటిని క్లియర్ చేయగలిగే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని, ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వివిధ సంఘటనలకు కులం, మతం రంగు పులుముతున్నారని, వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారని హెచ్చరించారు. అలాంటి వాటిని నియంత్రించేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని పేర్కొన్నారు. పాత కేసులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. 2019లో జరిగిన కొన్ని నేరాలను ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారని, శిక్షలు కూడా పడుతున్నాయని వివరించారు. వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలను పక్కాగా పాటించాలని, ప్రమాణాల ప్రకారం నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని ఆదేశించారు. డిసెంబర్ నెలలో క్వాంటం కంప్యూటర్ లాంఛ్ చేయాల్సి ఉందని, ఈలోగా క్వాంటం పార్కు, సెమీ కండక్టర్ల పార్క్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పచ్చదనం పెంపు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణ, నదీ జలాలను కాలుష్యం నుంచి కాపాడడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్