mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచేనేత కార్మికుల గర్జన

2 గంటల క్రితం

చేనేత సహకార సంఘాల నిరసన
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 01:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రూ.203 కోట్లు విడుదల చేయాలని డిమాండ్

  • నేతన్న భరోసా, పింఛన్ అమలు, రుణమాఫీ వర్తింపజేయాలని నినాదాలు

  • సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం : చేనేత ఐకాస

ప్రజాశక్తి- యంత్రాంగం : చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన రూ.203 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు హెచ్చరించారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ల వద్ద చేనేతలు పెద్ద ఎత్తున్న ఆందోళన చేపట్టారు. ఎపి చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు ఈ ఆందోళనలు చేపట్టారు.

గుంటూరు జిల్లా మంగళగిరి లోని చేనేత జౌళిశాఖ కమిషనర్‌ ‌ రాష్ట్ర కార్యాలయం వద్ద చేనేత కార్మికులు, నాయకులు ధర్నా చేశారు. ధర్నాలో నాయకులు మాట్లాడుతూ...చేనేత కార్మికుల సమస్యలను రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని, చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులకు త్రిఫ్ట్‌ ‌ఫండ్‌ ‌రూ.27 కోట్లు వెంటనే చెల్లించాలని, చేనేతల సంక్షేమానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ‘నేతన్న భరోసా’ ఆర్థిక సహాయాన్ని వెంటనే అమలు చేయాలని, చేనేత కార్మికులు, అనుబంధ ఉపవృత్తుల వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. చేనేత సహకార సంఘాలపై ఉన్న రుణాలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు రైతులకు అమలు చేస్తున్నట్లే చేనేతలకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు ఎన్నికలు నిర్వహించాలని, చేనేత వస్త్రాల తయారీలో వినియోగించే చీలపనులు, జరీ, పట్టు, రంగులు, రసాయనాలను సబ్సిడీ ధరలకు అందించాలని, హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం ప్రకారం చేనేతలకు కేటాయించిన 11 రకాల ఉత్పత్తుల రిజర్వేషన్లను కఠినంగా అమలు చేసి, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా సహకార బ్యాంకుల రుణాలపై పావలా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలని, త్రిఫ్ట్ ఫండ్ బకాయిలను వెంటనే చెల్లించాలని , అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేతపై జిఎస్‌‌టి పూర్తిగా రద్దు చేయాలని, కేంద్ర హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలని, చేనేత కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి జీవన భద్రత కల్పించాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, కట్టా శివదుర్గారావు, కమిటీ సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, కాసుల రవి, డోకుపర్తి రామారావు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. రాజు మాట్లాడుతూ...చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.రెండు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని, ముద్ర రుణాలు ఇవ్వాలన్నారు. మూడు సెంట్ల స్థలం కేటాయించి గృహ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు జిల్లాలోనే చేనేతలందరూ చేరుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మీ ఆశీస్సులు మాకు కావాలని విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడి నంచి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని ధర్నా నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ ముందు ‌పెద్దఎత్తున ఆందోళన చేశారు. అంతకుముందు స్థానిక గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసా‌ద్‌కు వినతిపత్రం అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్