• కోచింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటలు
• 15 మంది దుర్మరణం
• మృతుల సంఖ్య పెరిగే అవకాశం?
లక్నో : ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ఏరియాలో గల కోచింగ్ సెంటర్‌లో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయని, క్షతగాత్రులు కెజిఎంసి ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
అసలేం జరిగింది?
సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్‌లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో ఎక్కడేం జరుగుతోందో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగలు, మంటల మధ్య చిక్కుకుని కొంతమంది విద్యార్థులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. బయటకు వచ్చే మార్గం మూసుకుపోవడంతో విద్యార్థులు కిటికీలు, రైలింగ్‌ల నుండి దూకారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కొంతమంది పై అంతస్తుల నుండి కిందకు దూకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మంటలు చెలరేగుతున్న భవనం నుండి విద్యార్థులు కిందకు దూకారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పలు అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ దాదాపు గంటవరకూ రాలేదని, దీంతో మంటలు భవనాన్ని చుట్టుముట్టాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు చొప్పున ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు అందచేస్తామన్నారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. వారికి అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని, బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి బ్రజేష్ పాథక్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. తొలుత కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయని ఆయన పేర్కొన్నారు.
విద్యార్ధులందరినీ రక్షించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. లక్నో జిల్లా మేజిస్ట్రేట్ విశాఖ్ జి. అయ్యర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం మృతదేహాల గుర్తింపు, గాయపడిన వారి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.








కామెంట్‌లు (0)