ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీశైలం జలశయానికి తగ్గిన వరద

1 గంట క్రితం

Inflow into Srisailam reservoir decreases.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 12:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

శ్రీశైలం : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గింది.


మహారాష్ట్ర, కర్నాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గముఖం పట్టడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గింది. గత కొన్ని రోజులుగా దిగువకు భారీగా నీటిని విడుదల చేసిన అధికారులు, ఇన్ ఫ్లో తగ్గడంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను పూర్తిగా మూసివేశారు.


కర్నాటకలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 80,000 క్యూసెక్కులు, దిగువకు విడుదల 39,608 క్యూసెక్కులుగా ఉన్నాయి. నీటి విడుదల ఆధారంగా జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది.


గరిష్ట నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.51 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్ట్ ఎడమ, కుడి కాలువల ద్వారా దాదాపు 1.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.


జూరాల ప్రాజెక్ట్ గేట్లు మూసివేయడం, దిగువ కృష్ణా నదిలోకి నీటి విడుదల తగ్గించడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటి ప్రవాహం కూడా తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల నుంచి శ్రీశైలానికి కేవలం 36,233 క్యూసెక్కుల వరద ప్రవాహం మాత్రమే వస్తుంది. శనివారం సాయంత్రం నుంచి శ్రీశైలానికి వరద తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం డ్యామ్ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 878 అడుగులుగా ఉన్నది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం శ్రీశైలంలో 178.74 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రాల ద్వారా 38,369 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల అవుతుంది.


ఆగస్టు 13న కేఆర్ఎంబీ సమావేశం ....

కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగర్జునసాగర్‌లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, రాష్ట్రాల డిమండ్లపై చర్చించడానికి రావాలని కృష్ణా బోర్డు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఆగస్టు 13వ తేదీన హైదరాబాద్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. బోర్డు సభ్య కార్యదర్శి, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, ఎపి జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు.. ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు, శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలాంటి అంశాలను ప్రస్తావిస్తూ.. కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ లేఖ రాసింది. దీంతో సమావేశం జరగనుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్