ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధం..!

1 గంట క్రితం

veligonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఈ నెల 25–30 మధ్య ప్రారంభించే అవకాశం

  • శ్రీశైలం నుంచి వెలిగొండకు కృష్ణా జలాలు

ప్రజాశక్తి–మార్కాపురం: వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న నాలుగు జిల్లాల రైతులకు శాశ్వత పరిష్కారం చూపే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఈ ప్రాజెక్టును ఈ నెల 25 నుంచి 30వ తేదీలోపు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టుకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తొలుత 10 టీఎంసీల నీటి విడుదల

ట్రయల్‌ రన్‌ పూర్తయిన అనంతరం తొలుత 10 టీఎంసీల నీటిని వెలిగొండకు తరలించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నీటిని 20–25 రోజుల వ్యవధిలో ప్రాజెక్టుకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. కొల్లంవాగు వద్ద నిర్మించిన హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా జంట సొరంగాల నుంచి వచ్చే కృష్ణాజలాలు భూఉపరితల మార్గంలో 21.6 కిలోమీటర్లు ప్రయాణించి వెలిగొండ ప్రాజెక్టులోకి చేరుతాయి.

17 నాటికి పనులు పూర్తి

జంట సొరంగాల ద్వారా కృష్ణాజలాలను విడుదల చేసేందుకు అవసరమైన సాంకేతిక పనులన్నింటినీ ఈ నెల 17 నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయి, నీటి తరలింపుపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, వైఎస్సార్‌ కడప, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు మార్కాపురం ప్రాంతంలోని రైతులకు సాగునీటి భరోసా లభించనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కల సాకారమయ్యే అవకాశం ఏర్పడింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్