మంగళగిరి (గుంటూరు) : మంగళగిరిలో 80 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సోమవారం తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ’మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్ లో జరిగిన ఈ పట్టాల పంపిణీలో లోకేష్ పాల్గొన్నారు. 372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను లోకేష్ చేతులమీదుగా అందించారు. దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న లబ్ధిదారులకు శాశ్వత పట్టాలను పంపిణీ చేశారు. మిగిలిన కేంద్ర ప్రభుత్వ భూముల సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రూ.2 వేల కోట్ల విలువైన భూములను పేదలకు అందించామని తెలిపారు. 5,636 మందికి ఇప్పటికే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ .... 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు తాను కుంగిపోలేదని.. మరోసారి ఇక్కడే గెలవాలని పట్టుదలతో ముందుకెళ్లానని స్పష్టం చేశారు. పట్టాల సమస్య పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టుదలతో పనిచేస్తున్నామన్నారు. త్వరలో విజయవాడలో 24 వేల ఇళ్ల పట్టాలు అందిస్తామని అన్నారు. మంగళగిరిలో త్వరలో 100 పడకల ఆస్పతిని పూర్తి చేస్తామని వివరించారు. 2029లోపు మంగళగిరిలో గ్యాస్, తాగునీరు, భూగర్భ డ్రైనేజీ కనెక్షన్‌లను అందిస్తామని చెప్పారు. దేశంలోనే ఏ పాఠశాల లేని విధంగా నిడమర్రు స్కూల్‌ను తీర్చిదిద్దామని ఉద్ఘాటించారు. నిడమర్రు స్కూల్ తరహాలో మిగతా స్కూళ్లను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తొలి విడతలో 3,002 మందికి పట్టాలను పంపిణీ చేశామని మంత్రి లోకేష్ అన్నారు. రెండో విడతలో 2,634 మందికి పట్టాలు అందజేశామని చెప్పారు. మొదటి రెండు విడతల్లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములకు ఉచిత శాశ్వత పట్టాలను పంపిణీ చేసినట్లు వివరించారు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ భూముల్లో నివసిస్తున్న పేదలకు హక్కులు కల్పించే చర్యలు చేపట్టామని అన్నారు. వివిధ శాఖల సమన్వయంతో భూముల సమస్యలను పరిష్కరించి పట్టాల పంపిణీని చేపట్టామని మంత్రి లోకేష్ ప్రసంగించారు.








కామెంట్‌లు (0)