స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో స్వీకరణ
26లోగా పరిశీలన, ఆమోద ప్రక్రియ పూర్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వారికి మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సిఇఒ వాకాటి కరుణ పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ, అర్హత పరిశీలన, భౌతిక-శాఖాపరమైన ధృవీకరణ, ప్రభుత్వ ఆమోదం వంటి ప్రక్రియలను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయనుని ఆదేశించారు. అర్హులైన వారికి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కొత్త పింఛన్ల దరఖాస్తుల సేకరణ, పరిశీలన తదితర ప్రక్రియకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకూ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ధృవీకరణ చేయనున్నారు. 17 నుంచి 21వ తేదీ వరకూ సాధారణ అర్హత పరిశీలన, 22 నుంచి 24వ తేదీ వరకూ భౌతిక, శాఖాపరమైన ధృవీకరణ, అర్హత నిర్ణయం, సిఫారసు చేయనున్నారు. 25 నుంచి 26వ తేదీ వరకూ సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ చేపడతారు. అనంతరం అన్ని స్థాయిల్లో పరిశీలన పూర్తయిన అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. నిర్ణీత నమూనాలోని దరఖాస్తు ఫారాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తును పూర్తి చేసి, అవసరమైన ధృవపత్రాలతో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం వ్యవస్థ ద్వారా రూపొందించిన స్వీకరణ పత్రం అందజేస్తారని పేర్కొన్నారు.
ఏవరు ఏ ధృవీకరణ పత్రం జారీ చేయాలంటే..
అన్ని కేటగిరీలకు సాధారణంగా ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి అవసరమైన ప్రత్యేక ధృవపత్రాలను సమర్పించాలని సూచించారు. వృద్ధాప్య పింఛన్ కోసం వయస్సు నిర్ధారణకు ఆధార్ నంబరు, వితంతు పింఛన్ కోసం భర్త మరణ ధృవపత్రం, భర్త ఆధార్ నంబరు, ఒంటరి మహిళ పింఛన్ కోసం వివాహిత అయితే కోర్టు/అదాలత్ విడాకుల డిక్రీ; అవివాహిత అయితే తహసీల్దార్ జారీ చేసే అవివాహిత ధృవపత్రం సమర్పించాలన్నారు. దివ్యాంగుల పింఛన్ కోసం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌మార్క్ దివ్యాంగత్వాన్ని నిర్ధారించే సదరం ధృవపత్రం, చేనేత కార్మికుల పింఛన్ కోసం చేనేత, జౌళి శాఖ జారీ చేసిన ధృవపత్రం, మత్స్యకారుల పింఛన్ కోసం మత్స్య శాఖ జారీ చేసిన ధృవపత్రం, డప్పు కళాకారుల పింఛన్ కోసం సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవపత్రం, సంప్రదాయ చెప్పుల తయారీదారుల పింఛన్ కోసం సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవపత్రం, కల్లుగీత కార్మికుల పింఛన్ కోసం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ధృవపత్రం, ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులు జిల్లా వైద్య మండలి జారీ చేసిన ధృవపత్రం సమర్పించాలని సూచించారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.








కామెంట్‌లు (0)