mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయికృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలి

3 గంటల క్రితం

ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 01:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వైసిపి కాపు నాయకుల ఆత్మీయ సమావేశం తీర్మానం

ప్రజాశక్తి- రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ జిల్లా): విజయవాడలో కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగినట్లు భావిస్తున్న కాపు సామాజిక తరగతికి చెందిన గాదె సాయికృష్ణను ఆదుకోవాలని వైసిపిలోని కాపు నేతల ఆత్మీయ సమావేశం తీర్మానించింది. టిడిపి కూటమి ప్రభుత్వంలో కాపులకు గౌరవం దక్కడం లేదని పేర్కొంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో వైసిసి కాపు నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశ వివరాలను శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. తమ బాధలు పంచు కోవడానికి, ఒకరికి ఒకరు అండగా ఉండేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి సమావేశాలను విశాఖ, తిరుపతిలో కూడా నిర్వహిస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కాపులకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి అందరమూ వెళ్లి బాధితులకు అండగా నిలుస్తామన్నారు. తమంతా చట్టాన్ని గౌరవిస్తామని, రాజకీయాల్లో ప్రతీకార నిర్ణయాలు సరికాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చే హక్కులను కోరుతున్నామన్నారు. కాపులకు రూ.3.000 కోట్ల ఇస్తామని, కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని, వైసిపి ప్రభుత్వంలో కాపు నేస్తం కింద సాయం అందించామని తెలిపారు. రానున్న కాలంలో కాపు జాతి గౌరవం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కాపు నాయకుడు ముద్రగడ ఆనారోగ్య కారణాల వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారని తెలిపారు. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను వైసిపి నాయకులు కురసాల కన్నబాబు వివరించారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరు రూ.50 వేల చొప్పున వేసుకుని సాయికృష్ణ కుటుంబానికి అందించాలని నిర్ణయించారు. కాపు యువకుడైన సాయికృష్ణను పోలీసులు హత్య చేసి మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఈ సమావేశానికి ఎంఎల్సి తోట త్రిమూర్తులు, వైసిపి నాయకులు గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు, పేర్ని నాని, కురసాల కన్నబాబు, వంగా గీత, జక్కంపూడి రాజా, రాష్ట్రం నలుమూలల నుంచి వైసిపికి చెందిన కాపు ముఖ్య నేతలు హాజరయ్యారు. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయ సమాచారం.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్