mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సృజన స్వేచ్చా..? అవకాశవాదమా..?

3 గంటల క్రితం

review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 12:25 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

తెలుగు సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ వెలిబుచ్చుతున్న ద్వంద్వ ప్రమాణాలు ఇటీవల తీవ్ర చర్చకు దారి తీశాయి. అవసరానికి తగ్గట్టుగా మాట్లాడటం, విలువలకు తిలోదకాలు ఇవ్వటం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా "పెద్ది" సినిమాలో అతడు రాసిన పాటపై అభ్యంతరాలు వెలువెత్తిన సమయంలో దానిని సమర్థించుకున్న తీరు రెండు నాలుకల ధోరణికి అద్దం పట్టింది. ఈ సందర్భంగానే అతడు గతంలో హైందవ శంఖారావంలో చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి.

2025 జనవరి 5న గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జరిగిన హైందవ శంఖారావం సభలో అనంత శ్రీరామ్ హైందవ సంప్రదాయాలు, సినిమాల్లో వాటి చిత్రణ గురించి మాట్లాడారు. మహాభారతంలోని కర్ణుడి పాత్రను ఉదాత్తంగా చిత్రీకరించిన సినీ సంప్రదాయంపై దండెత్తారు. ద్రౌపదికి జరిగిన అవమానంలో భాగస్వామిగా నిలిచిన కర్ణుడిని మహనీయుడిగా, ధీరోదాత్తుడిగా చూపించడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. ఈ కృష్ణా జిల్లా వారే అలా చిత్రీకరించారని "దానవీరశూర కర్ణ" సినిమాను ప్రస్తావించి, నేరుగా నందమూరి తారక రామారావును, రచయిత కొండవీటి వెంకటకవిని విమర్శించారు. పురాణాల్లోని ద్రౌపది గౌరవం కోసం అంతటి ఆవేదన వ్యక్తం చేసిన వ్యక్తి, నేటి సమాజంలో జీవిస్తున్న మహిళల గౌరవం విషయంలో కూడా అదే సున్నితత్వాన్ని ప్రదర్శించకపోవటం పట్ల ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన "పెద్ది" సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ, కొన్ని పాటల భాషపై మహిళలు, యూట్యూబర్లు, సామాజిక వ్యాఖ్యాతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళను పురుషుడి కోరికకు సంబంధించిన వస్తువులా, డబ్బు పెట్టి పొందగల సరుకులా చిత్రీకరించారనే విమర్శలు వచ్చాయి. ఈ అభ్యంతరాల నేపథ్యంలో దర్శకుడు స్పందించారు. కొందరు బాధపడి ఉంటే ఆ అభ్యంతరాలను గౌరవిస్తున్నానని, క్షమాపణలు చెప్పారు. అవసరమైన మార్పులు కూడా చేస్తానని చెప్పారు. ఆయన విమర్శను వినడానికి సిద్ధపడ్డారు. ప్రజాస్వామ్య సమాజంలో దీనిని పరిపక్వత అంటారు.

క్షమాపణనే తప్పుబట్టిన అనంత శ్రీరామ్

ఆ తర్వాత జరిగిన ఒక వేదికపై ఈ అంశం మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. దర్శకుడు క్షమాపణ చెప్పడాన్ని ఒక విలేకరి సానుకూలంగా విశ్లేషించారు. పక్కనే ఉన్న అనంత శ్రీరామ్ మాత్రం వెంటనే జోక్యం చేసుకొని, దర్శకుడు అలా క్షమాపణ చెప్పడం తనకు నచ్చలేదని చెప్పారు. సినిమా ఎలా ఉండాలో, ఎలా తీయాలో దర్శకుడే నిర్ణయిస్తాడని, బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లు సృజనాత్మక స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని వాదించారు. మరి అదే సూత్రం "దానవీరశూర కర్ణ" విషయంలో ఎందుకు వర్తించదు? కర్ణుడిని ఏ కోణంలో చిత్రీకరించాలో నిర్ణయించే హక్కు ఆ చిత్ర దర్శకుడికి, రచయితకు ఎందుకు ఉండకూడదు? అక్కడ కళాత్మక స్వేచ్ఛను ప్రశ్నించి, ఇక్కడ మాత్రం కళాత్మక స్వేచ్ఛ పేరుతో అన్ని విమర్శలను తిరస్కరించడం ఎలా సమంజసం? పైగా కర్ణుడిని చూపిందీ అతడిలోని స్నేహనిబద్ధతను, వీరోచిత లక్షణాన్ని. దానివల్ల సమాజానికి జరిగే నష్టం ఏముంది? అనంత శ్రీరామ్ మాటల్లో ద్వంద్వ నీతిని పలువురు విమర్శిస్తున్నారు.

మహాభారతం - ఆధునిక సమాజం

మహాభారతం గొప్ప ఇతిహాసం. మూల రచయిత ఎక్కడా ఆయా పాత్రల స్వభావాలను దాచిపెట్టలేదు. అందులోని ప్రతి సామాజిక విలువను యథాతథంగా ఆధునిక సమాజానికి వర్తింపజేయడం సాధ్యం కాదు. ధర్మరాజు జూదంలో రాజ్యాన్ని మాత్రమే కాదు, ద్రౌపదిని కూడా పణంగా పెట్టాడు. అలాంటి చర్యను ఆధునిక సమాజం ఏమాత్రం అంగీకరించదు. మహిళను పురుషుడి ఆస్తిగా చూడటం నేడు నేరంగా, అనాగరికంగా పరిగణించబడుతుంది. మహాభారతం కర్ణుడిలోని లోపాలను మాత్రమే కాదు, అతని స్నేహనిబద్ధతను కూడా చూపించింది. "దానవీరశూర కర్ణ" చిత్రం ఆ కోణాన్ని ప్రధానంగా ఎంచుకుంది. కర్ణుడు–దుర్యోధనుడి మధ్య ఉన్న బంధాన్ని, నిబద్ధతను, త్యాగాన్ని హైలైట్ చేసింది. దానివల్ల సమాజానికి జరిగిన నష్టమేమీ లేదు.

ఇప్పుడు అనంత శ్రీరామ్ చేసినది అందుకు భిన్నమైనది. "వారానికో వేయి నాకోసం దాయి" అంటూ స్త్రీని సరుకుగా చేశాడు. బయట హోటల్‌కు వెళ్లి భోజనం చేసినంత ఈజీగా స్త్రీ–పురుష సంబంధాలను వ్యాఖ్యానించాడు. సృజన స్వేచ్ఛ ఉండాలి. అయితే అది సమాజాన్ని దిగజార్చేదిగా ఉండకూడదు. ఈ వివాదంలో మరో ముఖ్యమైన అంశం అనంత శ్రీరామ్ ఉపయోగించిన భాష. "ఐటమ్" అంటే వస్తువు. అలాంటి పాటను, భాషను వ్యతిరేకించే వారిని "ఐటమ్ గాళ్లు" అంటూ అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించారు. మహిళను వస్తువుగా చూడడాన్ని ప్రశ్నించే వారినే మళ్లీ అదే భాషతో సంబోధించడం సమస్యను మరింత తీవ్రం చేసింది.

నేటి మహిళల పట్ల గౌరవం ఏదీ?

మహాభారతంలోని ద్రౌపది అవమానం పట్ల సానుభూతి చూపించిన అనంత శ్రీరామ్, నేటి మహిళల విషయంలో అందుకు భిన్నంగా రాయటం ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తోంది. పురాణాల్లోని ఒక స్త్రీ గౌరవం కోసం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేడు జీవిస్తున్న మహిళలు తమను అవమానిస్తున్నారని చెబుతున్నప్పుడు వారి మాటలను నిర్లక్ష్యం చేయడం ఎలా సమంజసం? నేటి సమాజంలో ఉన్న అసమానతలను, స్త్రీలపై ఉన్న వస్తువీకరణను, అవమానకర చిత్రణలను గుర్తించడం మరింత అవసరం కదా? అది సృజన స్వేచ్ఛ ఎలా అవుతుంది? బాధ్యతారాహిత్యం అవుతుంది.

అనంత శ్రీరామ్‌కు తన రాజకీయ, సాంస్కృతిక విశ్వాసాలు ఉండవచ్చు. వాటిని వ్యక్తం చేసే హక్కు కూడా ఉంది. అయితే, ఒకే నైతిక ప్రమాణం, విలువల పాటింపు ఉండాలి. వాటిని పక్కన పెట్టి తన అవసరానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటే, అది అవకాశవాదం అవుతుంది. సమాజం నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

- శాంతిమిత్ర


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్