- నలుగురు మృతి
- క్రిమియాలో నిలిచిపోయిన *ఇంధన సరఫరా
మాస్కో : నల్ల సముద్ర ద్వీపకల్పంలోని చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో భీకర దాడి చేసింది. దీంతో రష్యా నియంత్రణలో ఉన్న క్రిమియాలో ఆదివారం పెట్రోల్ అమ్మకాలను నిలిపేస్తున్నామని అధికారులు తెలిపారు. అమెరికా అండదండలతో సాగించిని ఈ దాడుల్లో నలుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. రష్యా తన బలగాలకు ఇంధనాన్ని సరఫరా చేయడానికి ఈ కేంద్రాలు అత్యంత కీలకం. ఈ దాడుల నేపథ్యంలో క్రిమియా నాయకుడు సెర్గీ అక్సోనోవ్ మాట్లాడుతూ, ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిగాయన్నారు. తూర్పు రష్యాలోని క్రాస్నోడార్ ప్రాంతంలోని చమురు రవాణా కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందన్నారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెల్లవారుజామున 239 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు ప్రకటించింది. క్రిమియాలోని కెర్చ్ నగరంలో ఉన్న చమురు డిపో, క్రాస్నోడార్‌లోని చమురు రవాణా కేంద్రాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుందని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ధృవీకరించారు. రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా ట్యూమెన్ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లు దాడి చేశాయని ఆయన తెలిపారు. కొత్తగా మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగల డ్రోన్లలను తయారు చేశామని చెప్పుకొచ్చారు.
క్రిమియాలో ఇంధన కొరత..
ఉక్రెయిన్ క్రిమియాపై డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. ఇక్కడ రష్యా బ్లాక్ సీ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉంది. వేసవి సెలవుల సీజన్ ప్రారంభం కావడంతో ఈ దాడులు ద్వీపకల్పంలోని సరఫరా మార్గాలను లక్ష్యంగా చేసుకుని ఇంధన సంక్షోభానికి దారితీశాయి. విద్యుత్ నెట్‌వర్క్‌లకు నష్టం వాటిల్లిన తర్వాత అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడినట్లు స్థానిక విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ నివేదించింది. సెవాస్టోపోల్ గవర్నర్ మిఖాయిల్ రజ్వోజాయెవ్ ఇంధన సరఫరాలు ఆలస్యం అవుతున్నాయని, ఆదివారం ప్రైవేట్ వాహనదారులకు కేటాయించిన పెట్రోల్ రద్దు చేయబడిందని పోస్ట్ చేశారు. అధికారిక సేవలకు మాత్రమే ఇంధనం అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.








కామెంట్‌లు (0)