బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'సంజీవని' : ముఖ్యమంత్రి చంద్రబాబు

1 గంట క్రితం

'Sanjeevani' across the state from January 1: Chief Minister Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 05:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : రాష్ట్రంలో 2027 జనవరి 1 నుంచి "సంజీవని" ప్రాజెక్టును అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. కుప్పం, చిత్తూరులో వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలను విస్తరించేందుకు 90 రోజుల కార్యాచరణను అధికారులు సిద్ధం చేశారు. ఆరోగ్య డేటా భద్రత, డిజిటల్ హెల్త్ రికార్డులు, ప్రజలకు నేరుగా హెల్త్ అప్డేట్స్ అందించే వ్యవస్థతో ఏపీని వైద్య రంగంలో ఆదర్శంగా నిలపాలని అధికారులకు సీఎం సూచించారు. సంజీవని పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు అధికారులు 90 రోజుల ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, వైద్య సిబ్బందికి శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర పోర్టల్స్‌తో అనుసంధానం వంటి అంశాలను చేర్చారు. మొత్తం 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి ఈ పథకం అమలుపై శిక్షణ ఇవ్వనున్నారు. వైద్య సేవలను ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ విధానంలో అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.


చికిత్సతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానంలో ఆరోగ్యకరమైన మార్పులు తీసుకురావాలని సిఎం దిశానిర్దేశం చేశారు. హోమియోపతి, ఆయుర్వేదం, యోగా, ప్రాణాయామంతో పాటు ఆధునిక వైద్య విజ్ఞానాన్ని సమన్వయం చేయాలని ఆదేశించారు. ఏఐ డాక్టర్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. వైద్య డేటా భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర డ్యాష్‌బోర్డును రూపొందించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంతో పాటు వివిధ ఔట్‌సోర్సింగ్ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. సమర్థవంతంగా సేవలు అందించని ఔట్‌సోర్సింగ్ సంస్థలను తొలగించే విధానం రూపొందించాలన్నారు. ప్రజల్లో వైద్య వ్యవస్థపై విశ్వాసం పెరిగేలా సేవలు ఉండాలని మొబైళ్లకు నేరుగా ఆరోగ్య సంబంధిత సమాచారం చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆదేశించారు. కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సంజీవని ప్రాజెక్టు అమలు వల్ల వచ్చిన ఫలితాలను సమీక్షలో అధికారులు వివరించారు. చిత్తూరులో హైపర్‌టెన్షన్ కేసుల్లో 56 శాతం నియంత్రణలోకి రాగా, డయాబెటిస్ కేసుల్లో 16 శాతం తీవ్రత తగ్గినట్టు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య సేవల వినియోగం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. సంజీవని సేవలపై నిర్వహించిన పౌరుల సర్వేలో 91 శాతంమంది తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని అభిప్రాయపడ్డారని ఈ ఫలితాలను రాష్ట్రవ్యాప్త అమలుకు ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. సంజీవని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా సంస్థ వైద్యారోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సీఎం సూచించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్