టెహ్రాన్ : ఒమన్‌తో కుదిరిన ఒప్పందం హార్ముజ్ జలసంధిని తిరిగి తెవరడం గురించి కాదని ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగమంత్రి కాజెమ్ ఘరీబాబాది అన్నారు. మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సైనిక భద్రత మధ్య హార్ముజ్ జలసంధి మూసివేసే ఉందని ఉద్ఘాటించినట్లు స్థానిక మీడియా తెలిపింది. తాత్కాలిక సముద్రమార్గంపై ఒమన్‌తో కుదిరిన ఒప్పందం.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంగా భావించకూడదని అన్నారు. కొత్త సముద్ర మార్గం గురించి మాట్లాడుతూ.. గత 58 ఏళ్లుగా నౌకలు ఒమన్ జలాల మీదుగా ప్రయాణిస్తున్నాయని, దీంతో ఇరాన్ తీవ్రంగా నష్ట పోయిందని అన్నారు. హార్ముజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమైనందున.. నౌకల ప్రయాణ మార్గాల్లో ప్రాథమిక మార్పులు చేయడం తప్పనిసరని అన్నారు. ఒమన్‌తో కుదిరిన సముద్ర మార్గం ఒప్పందంపై స్పందిస్తూ.. పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశ మార్గం ఇరాన్ జలాల మీదుగా, నిష్క్రమణ మార్గం ఒమన్ ప్రాదేశిక జలాల మీదుగా ఉంటుందని అన్నారు. ఈ రెండు మార్గాలలోనూ నౌకలు ఇరాన్ జలాల మీదుగానే ప్రయాణిస్తాయని అన్నారు. ఈ మార్గం సుమారు 7 మైళ్ల మొత్తం వెడల్పుతో ఒక రౌండ్-ట్రిప్ హైవే లాంటిదని అన్నారు. ఈ మార్గం తాత్కాలికమైనదని, మునుపటి సముద్ర రవాణా ప్రణాళిక స్థానంలో, ఇరాన్, ఒమన్ 30 నుండి 60 రోజులలోపు ఒక కొత్త శాశ్వత మార్గం కోసం చర్చలు జరపాలని అన్నారు. ఏ నౌకలను హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతిస్తారనే అంశంపై స్పందిస్తూ.. అవగాహన ఒప్పందం ప్రకారం, ఏ సైనిక నౌకలను ప్రయాణించడానికి అనుమతించరని, కేవలం వాణిజ్య నౌకలను మాత్రమే అనుమతిస్తారని పునరుద్ఘాటించారు. అమెరికాతో చర్చలపై స్పందిస్తూ.. పరిస్తితులు మారాయని, గతంలో మాదిరిగా చర్చలు జరిగే అవకాశం లేదని అన్నారు.
ఇరాన్, ఒమన్‌ల మధ్య చర్చలు ఒక ఉమ్మడి కార్యవర్గ బృందం రూపంలో జరుగుతున్నాయని అన్నారు. ఈ బృందంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (పిఎంఒ), ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి)తో పాటు నౌకాదళం, డిప్యూటీ ప్రధాన కార్యాలయం కూడా ఉన్నాయని అన్నారు. అలాగే సాయుధ దళాల జనరల్ స్టాఫ్ కూడా చర్చల్లో పాల్గొంటున్నారని అన్నారు. మార్గాలకు సంబంధించిన ప్రధాన మార్గదర్శకత్వం వాస్తవానికి సాయుధ దళాల విభాగం, సంబంధిత సైనిక వ్యవస్థల వద్దే ఉంటుందని, ఇందులో సాయుధ దళాల జనరల్ స్టాఫ్, ఐఆర్‌జిసి , నావికాదళం కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఒమన్‌తో చర్చించిన ప్రతిపాదనలు ఇరాన్ సాయుధ దళాల నుండే వచ్చాయని, వాటికి సంబంధిత అన్ని సంస్థల మద్దతు ఉందని ఘరిబాబాది తెలిపారు. నౌకా మార్గాలకు సంబంధించిన అంశాలు సాంకేతికమైనవని, అవి విదేశాంగ శాఖ పరిధిలోకి రావని అన్నారు. సాయుధ దళాలు తమ విధిని సమర్థవంతంగా, అత్యంత జాగరూకతతో నిర్వహిస్తున్నారని , అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.







కామెంట్‌లు (0)